Kerala landslides: వయనాడ్‌లో పర్యటించిన రాహుల్, ప్రియాంక.. బాధితులకు పరామర్శ
ABN , Publish Date - Aug 01 , 2024 | 03:57 PM
కొండచరియలు విరిగిపడటంతో కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలోని రెండు గ్రామాలు తుడిచిపెట్టుకుపోవడంతో ఆత్మీయులను కోల్పోయిన బాధలో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారికి భరోసానివ్వడానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆగస్టు 1న వయనాడ్‌లో పర్యటించారు.
తిరువనంతపురం: కొండచరియలు విరిగిపడటంతో కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలోని రెండు గ్రామాలు తుడిచిపెట్టుకుపోవడంతో ఆత్మీయులను కోల్పోయిన బాధలో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారికి భరోసానివ్వడానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆగస్టు 1న వయనాడ్‌లో పర్యటించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వయనాడ్ పర్యటన వాయిదా పడిన ఒక రోజు తర్వాత రాహుల్, ప్రియాంక గురువారం మధ్యాహ్నం కేరళకు చేరుకున్నారు.
ఇరువురు నేతలు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలను సందర్శించారు. ఇరువురు ఉదయం 9.30కు కన్నూర్ విమానాశ్రయంలో దిగి రోడ్డు మార్గంలో వయనాడ్‌కు వెళ్లారు. మధ్యాహ్నానికి చూరల్‌మల చేరుకున్నారు. వీరి వెంట ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, అలప్పుజా ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రదేశంతో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్, డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజ్, మెప్పాడిలోని రెండు సహాయ శిబిరాలనూ సందర్శించారు.
చూరల్‌మలలో ఒక్కచోటే 250 మందికి పైగా మరణించగా.. 200 మంది గాయపడ్డారు. జులై 30 తెల్లవారుజామున వయనాడ్‌లోని ముండక్కై, చురల్‌మలలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి విధ్వంసం సృష్టించాయి. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
మృతదేహాలపై పడ్డ బండరాళ్లను అడ్డుతొలగించడానికి యంత్రాలసాయంతో సహాయక చర్యలు చేపట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రాహుల్ గాంధీ 2024 ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి మళ్లీ గెలుపొందారు. అయితే ఆయన గత ఎన్నికల్లో యూపీలోని రాయబరేలి నుంచీ పోటీ చేశారు. రెండింట్లో ఒక సీటును వదులుకోవాల్సి రావడంతో రాహుల్.. వయనాడ్ సీటుకి రాజీనామా చేశారు. ఈ ఎంపీ స్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేయాలని భావిస్తున్నారు.
రెస్క్యూ సిబ్బందికి సవాళ్లు..
కొండచరియలు విరిగిపడటంతో భారీ వృక్షాలు సైతం గ్రామాలపైకి వచ్చాయి. దీంతో వాటిని తొలగించేందుకు భారీ యంత్రాలు అవసరమని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. భారీ యంత్రాలతోనే సెర్చ్ ఆపరేషన్‌లో పురోగతి సాధించగలమని ఆయన అన్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఆర్మీ, నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసు, ఫైర్ అండ్ రెస్క్యూ, ఇతర బలగాలతో సహా 1,600 మందికి పైగా రెస్క్యూ వర్కర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారని కేరళ రెవెన్యూ శాఖ మంత్రి రాజన్ తెలిపారు.