Khushboo: బీజేపీ ప్రచారానికి దూరంగా ఖుష్బూ?
ABN , Publish Date - Mar 27 , 2024 | 01:59 PM
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ(Khushboo)ను బీజేపీ దూరం పెట్టింది.
చెన్నై: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ(Khushboo)ను బీజేపీ దూరం పెట్టింది. తాజాగా పార్టీలో చేరిన మరో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్‌కు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీటును కేటాయించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో లోలోపల కుమిలిపోతున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పెద్దలు అన్నామలై, ఎల్.మురుగన్, తమిళిసై సౌందర్‌రాజన్, రాధికా శరత్‌కుమార్ వంటి ముఖ్యులకు సీటు కేటాయించింది. ఆ కోణంలో చూస్తే ఖుష్బూకు కూడా బీజేపీ పెద్దలు సీటు కేటాయించాల్సి ఉంది. కానీ, ఆమెకు మొండి చేయి చూపించారు. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖుష్బూ పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఈ లోక్‌సభ ఎన్నికల్లో చెన్నై జిల్లాలోని మూడు లోక్‌సభ స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని ఆమెకు కేటాయిస్తారని భావించారు. కానీ, ఆమెకు అవకాశం ఇవ్వలేదు. ఇదే విషయంపై బీజేపీ వర్గాలను పలకరించగా, ఎక్కడ ఏం మాట్లాడాలో ఖుష్బూకు ఇంకా తెలియలేదని, తమిళనాడు ప్రభుత్వం మహిళలకు ప్రతి నెలా ఇస్తున్న రూ.1000ను భిక్షగా వ్యాఖ్యానించడం, రాష్ట్రంలో వివాదమైందన్నారు. ఈ వ్యాఖ్యలు పార్టీ అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించాయంటున్నారు. అలాగే, రాష్ట్రంలోని మహిళలు కూడా ఖుష్బూ పట్ల సానుకూలంగా లేరని, అందువల్ల ఆమెకు సీటు ఇస్తే ఓడిపోతారన్న భావనతో కేటాయించలేదని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.