Share News

Kolkata : ఎట్టకేలకు మమతతో వైద్యుల చర్చలు

ABN , Publish Date - Sep 17 , 2024 | 03:03 AM

సమ్మె చేస్తున్న జూనియర్‌ డాక్టర్లు ఎట్టకేలకు సోమవారం సాయంత్రం పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతతో చర్చలు జరిపారు.

Kolkata : ఎట్టకేలకు మమతతో వైద్యుల చర్చలు

  • ముఖ్యమంత్రి సీఎం మమత నివాసంలో భేటీ

  • ముందుగానే లిఖితపూర్వకంగా షరతులు అందజేసిన ప్రతినిధులు

  • మినిట్స్‌ నమోదుకు సొంత స్టెనోగ్రాఫర్లు

  • వీడియో తీయించిన ప్రభుత్వం

కోల్‌కతా, సెప్టెంబరు 16: సమ్మె చేస్తున్న జూనియర్‌ డాక్టర్లు ఎట్టకేలకు సోమవారం సాయంత్రం పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతతో చర్చలు జరిపారు. రెండుసార్లు సచివాలయానికి వెళ్లి ఆమెతో భేటీ కాకుండా వెనక్కి వచ్చిన వైద్యులు మూడో సారి మాత్రం చర్చల్లో పాల్గొన్నారు. ఈ సారి కాళీఘాట్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో చర్చలు జరిగాయి. పోలీసు పైలట్‌ వాహనం ఎస్కార్టుగా రాగా 35 మంది జూనియర్‌ డాక్టర్లు సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. నిజానికి సాయంత్రం 5 గంటలకు చర్చలు ప్రారంభించాల్సి ఉన్నా 7 గంటలకు మొదలయ్యాయి.

రెండు గంటల పాటు అంటే రాత్రి 9గంటల వరకు సాగాయి. తొలిసారి గురువారం రాష్ట్ర సచివాలయంలోని మీటింగ్‌ హాలులో ముఖ్యమంత్రి గంటల తరబడి వేచి చూసినా జూనియర్‌ డాక్టర్లు వెళ్లలేదు. రెండోసారి శనివారం వెళ్లినా చర్చల ప్రత్యక్ష ప్రసారంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జరగలేదు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ మొత్తంగా నాలుగుసార్లు చర్చలకు ఆహ్వానించినా జూనియర్‌ డాక్టర్లు సానుకూలంగా వ్యవహరించడం లేదని అభిప్రాయపడింది. ఇది అయిదోది, చివరిది అని తాజా చర్చలపై వ్యాఖానించింది.

చర్చలకు కాకపోయినా కనీసం టీ తాగడానికైనా తన ఇంటికి రావాలని కోరుతూ శనివారం మమతా బెనర్జీ సెల్‌ఫోన్‌ వీడియో విడుదల చేశారు. ఈ సారి మాత్రం జూనియర్‌ డాక్టర్లు తమ షరతులను లిఖితపూర్వకంగా ముందుగానే పంపించారు. మినిట్స్‌ రాయడానికి తమ సొంత స్టెనోగ్రాఫర్లను తీసుకెళ్లారు. మొత్తం చర్చలను ప్రభుత్వం వీడియో తీయించింది. దీక్షా శిబిరానికి వెళ్లి సహచరులతో మాట్లాడిన తరువాత చర్చలపై తమ అభిప్రాయాలను చెబుతామని జూనియర్‌ డాక్టర్లు తెలిపారు.

మినిట్స్‌ను ఖరారు చేయడంపై ఇరు పక్షాలు సంప్రదింపులు జరుపుతున్నాయి. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం... ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలన్న డిమాండుపై ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలిసింది. రోగులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా సమ్మె విరమించాలని మమతా బెనర్జీ వారిని కోరారు.

మహిళా జూనియర్‌ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య కేసుపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుందని తెలిపారు. జూనియర్‌ డాక్టర్లు మాత్రం చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని పట్టుబట్టారు. ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాఽధికారులతో పాటు కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను తొలగించాలని మరోసారి డిమాండు చేశారు.

Updated Date - Sep 17 , 2024 | 03:03 AM