Priyanka Gandhi: ఆయన ఔట్ సైడర్.. పనిచేసేది కూడా ఔట్ సైడర్ల కోసమే
ABN , Publish Date - Sep 28 , 2024 | 06:45 PM
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి శనివారంనాడు జమ్మూలోని బిష్ణహ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు.
జమ్మూ: ఔట్ సైడర్ (Out-sider) అంశాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల (Jammu and Kashmir Assembly Elections) ప్రచారంలో ప్రస్తావించారు. లెఫ్టినెంట్ గవర్నర్ (LG) మనోజ్ సిన్హా (Manoj Sinha)ను, బీజేపీని టార్గెట్ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ బయట వ్యక్తి అని, జమ్మూకశ్మీర్ ప్రజల కోసం కాకుండా బయట వాళ్ల కోసం పనిచేస్తు్న్నారని విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి శనివారంనాడు జమ్మూలోని బిష్ణహ్ (Bishnah)లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతంలో టెంటర్లు బయట వ్యక్తులకు ఇస్తున్నారనీ, ఇసుకను కూడా బయటకు తరలిస్తూ, తిరిగి తెచ్చుకునేటప్పుడు ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు.
Jammu and Kashmir Elections: తొలిసారి పూర్తి మెజారిటీతో బీజేపీ సర్కార్ తథ్యం: మోదీ
''మీ ఎల్జీ బయట వ్యక్తి. బయట వ్యక్తుల కోసమే విధానాలు తీసుకువస్తు్న్నారు. కాంట్రాక్టులు బయట వ్యక్తులకు ఇస్తు్న్నారు. మీ ఇసుక బయటకు పంపుతున్నారు. మీరు కొనాల్సి వచ్చినప్పుడు హెచ్చు ధరకు కొనాల్సి వస్తోంది. బయట కంపెనీలు ఇక్కడకు వచ్చి ప్రతీదీ దోచుకుంటున్నారు. బయటనున్న మిత్రులకే కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు. బయట కంపెనీలు ఇక్కడకు తెస్తుండటం వల్ల మీ చిరు వ్యాపారాలన్నీ దెబ్బతింటాయి'' అని ప్రియాంక గాంధీ వివరించారు. మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన చిన్న వ్యాపారులను దెబ్బతీసి, కొద్దిమంది వ్యాపారవేత్తల కోసం పనిచేస్తోందని ఆమె విమర్శించారు. బిష్ణహ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నీరజ్ కుందన్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరిదైన మూడో విడత పోలింగ్ అక్టోబర్ 1న జరుగనుండగా, అక్టోబర్ 8న ఫలితాలు వెలువడతాయి.
For National News And Telugu News..
Also Read: Hardeep Singh Puri: పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయా? కేంద్రమంత్రి కీలక ప్రకటన