Lok Sabha Polls: ఓటు వెయ్యండి.. మందు బాటిల్‌పై డిస్కౌంట్ పొందండి..
ABN , Publish Date - May 07 , 2024 | 10:04 PM
‘బుల్లెట్ కంటే బ్యాలెట్ బలమైనది’.. ‘మార్పు కోరుకోవడం మాత్రమే సరిపోదు.. మీరు వెళ్లి ఓటు వేయడం ద్వారా మార్పు చేసుకోవాలి’.. ‘బలమైన దేశాన్ని సృష్టించేందుకు మీ ఓటు హక్కును వినియోగించుకోండి’ అనే నినాదలు మనకు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. అయితే, చాలా మంది ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తారు.
బెంగళూరు, మే 07: ‘బుల్లెట్ కంటే బ్యాలెట్ బలమైనది’.. ‘మార్పు కోరుకోవడం మాత్రమే సరిపోదు.. మీరు వెళ్లి ఓటు వేయడం ద్వారా మార్పు చేసుకోవాలి’.. ‘బలమైన దేశాన్ని సృష్టించేందుకు మీ ఓటు హక్కును వినియోగించుకోండి’ అనే నినాదలు మనకు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. అయితే, చాలా మంది ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తారు. ఓటేగా వేస్తే ఏంటి.. వెయ్యకపోతే ఏంటి? అని నిర్లక్ష్యంగా వ్యహరిస్తారు.
అందుకే.. ఓటర్లు తమ హక్కును వినియోగించేలా ప్రోత్సహించేందుకు ఎన్నికల సంఘం అనేక ప్రయత్నాలు చేస్తుంటుంది. ఓటర్లలో చైతన్యం నింపేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఇటీవలే మధ్య ప్రదేశ్‌లో ఓటు వేయండి.. బంగారం గెలుచుకోండి అంటూ ఎన్నికల అధికారులు వినూత్న రీతిలో ఆఫర్స్ ప్రకటించారు. తాజాగా కర్ణాకటలో ఇలాంటి ఆఫరే ఇచ్చారు. అయితే, ఇది ఎన్నికల అధికారులు మాత్రం కాదు. వైన్ షాప్ నిర్వాహకులు ఈ ఆఫర్ ఇచ్చారు. కర్ణాటకలోని హుబ్బళీలో లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓ బార్ యజమాని వినూత్న ఆఫర్ ప్రకటించారు. ఓటింగ్ శాతం పెంచే లక్ష్యంలో మద్యం ఆఫర్ ప్రకటించాడు. ఓటు వేసినట్లు ఇంక్ మార్క్ చేపిస్తే.. వారికి మద్యంపై ప్రత్యేక రాయితీ అందిస్తున్నాడు.
హుబ్బళి కుసుగల్ రోడ్డులోని కర్ణాకట వైన్స్ షాపు యజమాని ఈ వినూత్న ఆఫర్‌ను ప్రకటించాడు. మద్యం ఎంఆర్‌పీ ధరపై 3 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. బలమైన భారతదేశాన్ని తయారు చేయడానికి ప్రతి ఒక్కరమూ మంచి నాయకుడిని ఎన్నుకుని పార్లమెంట్‌కు పంపేందుకు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువ నమోదైందని.. ఈసారి అలా కాకుండా ఉండాలనే ఈ ఆఫర్ పెట్టినట్లు వైన్ షాప్ యజమాని తెలిపాడు. ఓటు వేసిన సిరా గుర్తు చూపి మద్యం కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ ఇస్తామని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ వైన్ షాప్ యజమాని ఓటర్లకు డిస్కౌంట్‌పై మద్యం విక్రయించారు.