Lok Sabha Elections: బీజేపీకి బిగ్ షాక్.. సైడ్ అవుతున్న కీలక వర్గం.. !
ABN , Publish Date - Apr 12 , 2024 | 08:33 AM
దశాబ్దాలుగా బీజేపీకి(BJP) మద్దతిస్తూ వస్తున్న రాజ్‌పుట్‌లు(Rajput) ఈసారి ఆ పార్టీపై కారాలు మిరియాలు నూరుతున్న విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా యూపీ(Uttar Pradesh), గుజరాత్(Gujarat) తదితర రాష్ట్రాల్లో రాజ్‌పుత్‌లు ఏకంగా బీజేపీని వ్యతిరేకిస్తూ బహిరంగ సభలు, సమావేశాలు, కుల పంచాయతీలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ యూపీలోని సహారన్‌పూర్‌లో ఈ నెల 7వ తేదీన రాజ్‌పుత్‌లు..
ఎన్నికల్లో తమకు తగినన్ని టికెట్లు ఇవ్వటం లేదని విమర్శ
పశ్చిమ యూపీలో పెరుగుతున్న వ్యతిరేకత
మహాపంచాయత్‌లలో బీజేపీ వ్యతిరేక తీర్మానాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: దశాబ్దాలుగా బీజేపీకి(BJP) మద్దతిస్తూ వస్తున్న రాజ్‌పుట్‌లు(Rajput) ఈసారి ఆ పార్టీపై కారాలు మిరియాలు నూరుతున్న విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా యూపీ(Uttar Pradesh), గుజరాత్(Gujarat) తదితర రాష్ట్రాల్లో రాజ్‌పుత్‌లు ఏకంగా బీజేపీని వ్యతిరేకిస్తూ బహిరంగ సభలు, సమావేశాలు, కుల పంచాయతీలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ యూపీలోని సహారన్‌పూర్‌లో ఈ నెల 7వ తేదీన రాజ్‌పుత్‌లు మహా పంచాయత్ నిర్వహించారు. పశ్చిమ యూపీలో తమ జనాభా దాదాపు 10 శాతం ఉన్నప్పటికీ బీజేపీ తమకు కేవలం ఒక్క టికెటే (మొరాదాబాద్) కేటాయించి అవమానించిందని సదరు పంచాయత్‌లో పలువురు రాజ్‌పుత్ నేతలు విరుచుకుపడ్డారు. ఘజియాబాద్ నుంచి ఎంపీగా ఉన్న తమ సామాజికవర్గానికి చెందిన జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్‌ను బీజేపీ ఈసారి పక్కనపెట్టి టికెట్‌ను మరొకరికి కేటాయించటంపైనా రాజ్‌పుత్‌లలో తీవ్ర ఆగ్రహం కలిగించింది. పశ్చిమ యూపీలో బీజేపీపై వ్యతిరేకత రాజ్‌పుత్‌లకే పరిమితం కాలేదు. త్యాగి, సైని వంటి ఇతర అగ్రకులాలు కూడా తమకు చాలా తక్కువగా టికెట్లు కేటాయించటంపై ఆగ్రహంతో ఉన్నాయి. అవి కూడా ఇటీవలి కాలంలో మహా పంచాయత్‌లను నిర్వహించి బీజేపీ వ్యతిరేక తీర్మానాలు చేశాయి.
మరోవైపు, గుజరాత్‌లో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా ఇటీవల దళిత సామాజికవర్గంతో నిర్వహించిన ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ.. రాజులు, మహారాజులు బ్రిటీష్ వారితో లాలూచీ పడ్డారని, వారికి తమ కుమార్తెలను ఇచ్చి వివాహాలు చేశారని, దళితులు మాత్రం ఎన్ని అణిచివేతలు ఎదురైనా విలువలకు కట్టుబడి ఉన్నారని వ్యాఖ్యానించటంపై గుజరాత్‌తోపాటు పలు రాష్ట్రాల్లో రాజ్‌పుత్‌లు భగ్గుమన్నారు. తీవ్ర నిరసన తెలుపుతున్నారు. మంత్రి క్షమాపణ చెప్పినప్పటికీ.. వారు శాంతించటం లేదు. రాజ్‌కోట్ నుంచి రూపాల అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించాలని, లేదంటే బీజేపీని ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. రాజ్‌పుత్‌ల నాయకుడు ఠాకూర్ పూరన్‌సింగ్ దీనిపై స్పందిస్తూ.. ‘మా చరిత్రను వక్రీకరించటం, ఆర్థికంగా బలహీన వర్గాలకు ఇచ్చే ప్రోత్సాహకాల్లో మాకు న్యాయం చేయకపోవటం, లోక్‌సభ ఎన్నికల్లో మాకు తగిన ప్రాతినిధ్యం కల్పించకపోవటం వంటి అనేక పనులకు బీజేపీ పాల్పడుతోంది.
మొత్తంగా రాజ్‌పుత్ సామాజికవర్గాన్నే అణచివేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీకి గుణపాఠం చెప్పాలని మేం నిశ్చయించుకున్నాం’ అని తెలిపారు. ఇతర సామాజికవర్గాలు సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నా వారికి ఎంపీ టికెట్ల పరంగా, మంత్రిపదవుల పరంగా ప్రాధాన్యం కల్పిస్తున్నారని, కానీ, తమను ఉద్దేశపూర్వకంగా తొక్కేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ సంప్రదాయ ఓటు బ్యాంకు అని ఓవైపు మమ్మల్ని భ్రమల్లో ముంచుతూనే మరోవైపు మోసగిస్తున్నారని, కాబట్టే, ఈసారి బీజేపీని ఓడించే పార్టీకే మద్దతివ్వాలని నిర్ణయించామని ఠాకూర్ పూరన్‌సింగ్ తెలిపారు.