Rahul Gandhi: 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలి: రాహుల్
ABN , Publish Date - Oct 06 , 2024 | 03:09 PM
దేశంలో కులగణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ఇందువల్ల ప్రతి కులంలో ఎంతమంది జనాభా ఉన్నారనేది తెలియడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థపై వారికి ఏమేరకు నియంత్రణ ఉందనేది తెలుస్తుందని అన్నారు.
కొల్హాపూర్: రాజ్యంగ పరిరక్షణకు రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగించాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇందు కోసం పార్లమెంటులో చట్టాల ఆమోదానికి కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా (INDIA) కూటమి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. కొల్హాపూర్‌లో జరిగిన 'సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్' కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ, దేశంలో కులగణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందువల్ల ప్రతి కులంలో ఎంతమంది జనాభా ఉన్నారనేది తెలియడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థపై వారికి ఏమేరకు నియంత్రణ ఉందనేది తెలుస్తుందని అన్నారు.
జమ్మూకశ్మీర్‌లో ‘నామినేటెడ్’ మంటలు!
''దేశ జనాభాలో 90 శాతం మందికి అవకాశాల తలుపులు మూసేశారు. జనాభాలోని ఒక చిన్నపాటి వర్గమే కీలకమైన విధాన నిర్ణయాలపై ఆధిపత్యం చెలాయిస్తోంది. దేశ జనాభాలో కనీసం 50 శాతం మంది ఓబీసీలు ఉన్నారు. 90 మంది టాప్ ఐఏఎస్ అధికారుల్లో ఈ వర్గం నుంచి కేవలం ముగ్గురే ఉన్నారు. అదేవిధంగా దళితులు, ఆదివాసీలు కలిసి జనాభాలో 23 శాతం ఉన్నారు. కీలక పదవుల్లో వారి ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. దళితులు ముగ్గురు, ఆదివాసీలు ఒకరు ఉన్నారు. ఈ వాస్తవాన్ని మరుగుపరచేందుకే జనగణనను బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు. ఈ వర్గాలను అణగదొక్కేందుకే దళితులు, వెనుకబడిన తరగతులకు చెందిన చరిత్రను పాఠ్యాంశాలలోంచి కనుమరుగు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని 'డి రిజర్వేషన్'తో రాహుల్ పోల్చారు. ఏళ్ల తరబడి రిజర్వేషన్లను బీజేపీ, ఆర్ఎస్ఎస్ అణగదొక్కుతున్నాయని విమర్శలు గుప్పించారు.