Mamata meet with Modi: మోదీని కలిసిన మమతా బెనర్జీ... కారణం ఏమిటంటే?
ABN , Publish Date - Mar 01 , 2024 | 09:17 PM
రెండ్రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమబెంగాల్ వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో కలిసారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల బకాయిల అంశాన్ని ఈ సమావేశంలో మోదీ దృష్టికి మమత తీసుకువచ్చారని తెలుస్తోంది.
కోల్‌కతా: రెండ్రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమబెంగాల్ (West Bengal) వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో కలిసారు. ప్రధాని తన పర్యటనలో హుగ్లీ, నదియా జిల్లాల్లో జరిగే ర్యాలీలో పాల్గొనడంతో పాటు పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. శుక్రవారం రాత్రి రాజ్‌భవన్‌లో బస చేస్తున్నారు.
రాజకీయ సమావేశం కాదు...
కాగా, ఇది ఎంతమాత్రం రాజకీయపరమైన సమావేశం కాదని మోదీతో సమావేశానంతరం మమతా బెనర్జీ తెలిపారు. మర్యాదపూర్వకంగా కలిసేందుకే వచ్చానన్నారు. ప్రధాన మంత్రి కానీ, రాష్ట్రపతి కానీ రాష్ట్రానికి వస్తే వారిని ముఖ్యమంత్రి కలుసుకోవడం ప్రోటాకాల్ అని చెప్పారు. ఇది ఎంతమాత్రం రాజకీయ సమావేశం కాదని స్పష్టం చేశారు.
సమావేశం ప్రాధాన్యత
పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి కేంద్ర రూ.1.18 లక్షల కోట్లు బకాయి పడిందని మమతా బెనర్జీ కొద్దికాలంగా ఆరోపణలు కొనసాగిస్తున్న తరుణంలో ప్రధానమంత్రిని కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించకుంది. సుమారు 30 లక్షల మంది ఎంజీఎన్ఆర్ఈజీఏ వర్కర్లకు బెంగాల్ ప్రభుత్వం వచ్చే సోమవారంనాడు బకాయిల చెల్లింపులు జరపనుంది. 2023 మార్చి నుంచి రూ.2,700 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఈ క్రమంలోనే రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు చెల్లించాలని మమతా బెనర్జీ గత ఏడాది డిసెంబర్‌లో ప్రధానిని న్యూఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేశారు. తాజాగా ప్రధానితో జరిగిన సమావేశంలోనూ బకాయిల విషయాన్ని మరోసారి మమత ఆయన దృష్టికి తీసుకువెళ్ళినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.