Share News

China flag in Isro Ad: డీఎంకే 'చైనా రాకెట్' యాడ్‌పై దుమారం

ABN , Publish Date - Feb 28 , 2024 | 07:55 PM

తమిళనాడులోని తూత్కుకుడి జిల్లా కులశేఖర పట్టణంలో ఇస్రో లాంచ్ ప్యాడ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారంనాడు శంకుస్థాపన చేశారు. అయితే, అనూహ్యంగా ఈ శంకుస్థాపన కార్యక్రమం కోసం డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన 'ఇస్రో' యాడ్ తీవ్ర దుమారం రేపింది. ప్రధాని మోదీ సహా, బీజేపీ నేతలు డీఎంకేను తప్పుపట్టగా, తూత్తుకుడి ఎంపీ కనిమొళి డీఎంకేను సమర్ధించారు.

China flag in Isro Ad: డీఎంకే 'చైనా రాకెట్' యాడ్‌పై దుమారం

చెన్నై: తమిళనాడులోని తూత్కుకుడి జిల్లా కులశేఖర పట్టణంలో ఇస్రో లాంచ్ ప్యాడ్ (ISRO rocket launch site)కు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారంనాడు శంకుస్థాపన చేశారు. అయితే, అనూహ్యంగా ఈ శంకుస్థాపన కార్యక్రమం కోసం డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన 'ఇస్రో' యాడ్ (ISRO Ad) తీవ్ర దుమారం రేపింది. ప్రధాని మోదీ సహా, బీజేపీ నేతలు డీఎంకేను తప్పుపట్టగా, తూత్తుకుడి ఎంపీ కనిమొళి సొంత పార్టీని (DMK)ను సమర్ధించారు


వివాదం ఇలా...

ఇస్రో సెకెండ్ ల్యాంచ్ ప్యాడ్ శంకుస్థాపన సందర్భంగా తమిళనాడు పశుసంవర్ధక శాఖ మంత్రి అనితా రాథాకృష్ణన్ స్థానిక పత్రికలకు ప్రకటన ఇచ్చారు. ఇందులో ప్రధానమంత్రి మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్, ఇతర డీఎంకే నేతలతో పాటు చైనా జాతీయ జెండాతో ఉన్న రాకెట్ కనిపించడంతో దుమారం రేగింది. దీనిపై బీజేపీ చీఫ్ అన్నామలై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే నిబద్ధత, దేశ సౌరభౌమత్యం విస్మరణను ఇది తలపిస్తోందని, గత తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు డీఎంకే ప్రయత్నిస్తోందని ఆరోపించారు.


శాస్త్రవేత్తలను అవమానిస్తున్నారు: మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం అధికార డీఎంకేపై నిప్పులు చెరిగారు. డీఎంకే పనిచేయకపోవడమే కాకుండా తప్పుడు క్రెడిట్ ఆపాదించుకుంటోందని, కేంద్రం పథకాలపై వాళ్ల (డీఎంకే) స్టిక్కర్లు అంటించుకున్నారని, ఇస్రో లాంచ్‌ప్యాడ్‌‌పై చైనా స్టిక్కర్ అంటించి క్రెడిట్ వారికి ఆపాదిస్తున్నారని విమర్శించారు. అంతరిక్ష రంగంలో భారతదేశ ప్రగతిని అంగీకరించేందుకు వాళ్లు (డీఎంకే) సిద్ధంగా లేదన్నారు. అంతరిక్ష రంగంలో భారత విజయాలను ప్రపంచానికి చాటేందుకు ఇష్టపడటం లేదని, మన శాస్త్రవేత్తలను, మన అంతరిక్ష కేంద్రాన్ని కూడా విమర్శిస్తున్నారని తప్పుపట్టారు. వాళ్లు చేసిన తప్పదాలకు శిక్ష విధించే సరైన సమయం ఇదేనని అన్నారు.


చైనాను శత్రుదేశమని ప్రకటించారా?: కనిమొళి

చైనా రాకెట్ యాడ్‌పై మోదీ వ్యాఖ్యలను డీఎంకే ఎంపీ కె.కనిమొళి తిప్పికొట్టారు. యాడ్ ఫోటోలో ఆర్ట్ వర్క్ చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలిదని అన్నారు. చైనాను శత్రుదేశంగా భారత్ ప్రకటించినట్టు తాను అనుకోవడం లేదని చెప్పారు. ''మన ప్రధాని చైనా ప్రధానిని ఆహ్వానించాను. కలిసి మహాబలిపురం వెళ్లారు. నిజాన్ని ఒప్పుకోవడానికి మీరు (ప్రధాని) సిద్ధంగా లేనందునే సమస్యను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మీరు చేస్తున్నారు'' అని కనిమొళి వ్యాఖ్యానించారు.

Updated Date - Feb 28 , 2024 | 08:01 PM