Share News

Modi : విశ్వ జ్ఞాన కేంద్రంగా భారత్‌ను తిరిగి నిలబెడతా

ABN , Publish Date - Jun 20 , 2024 | 03:07 AM

విశ్వజ్ఞాన కేంద్రంగా భారత్‌ను తిరిగి నిలపడటమే తన లక్ష్యమని ప్రధాని మోదీ ప్రకటించారు. బిహార్‌లోని నలంద యూనివర్సిటీ నూతన క్యాంప్‌సను బుధవారం ఆయన ప్రారంభించారు.

Modi : విశ్వ జ్ఞాన కేంద్రంగా భారత్‌ను తిరిగి నిలబెడతా

నలంద వర్సిటీ కొత్త క్యాంపస్‌ ప్రారంభోత్సవంలో మోదీ

రాజ్‌గిర్‌ (బిహార్‌), జూన్‌ 19: విశ్వజ్ఞాన కేంద్రంగా భారత్‌ను తిరిగి నిలపడటమే తన లక్ష్యమని ప్రధాని మోదీ ప్రకటించారు. బిహార్‌లోని నలంద యూనివర్సిటీ నూతన క్యాంప్‌సను బుధవారం ఆయన ప్రారంభించారు. భారతీయ జ్ఞాన వారసత్వానికి నలంద చిహ్నమని, దేశాల మధ్య వారధిలా అది నిలబడి ఉందని తెలిపారు. ‘‘నలంద కేవలంపేరు కాదు. అదొక తారకమంత్రం.

పుస్తకాలను తగలబెట్టవచ్చు, కానీ జ్ఞానాన్ని కాదు అనేందుకు నలంద అస్థిత్వమే తిరుగులేని నిదర్శనం’’ అని ఆయన అన్నారు. మరికొద్ది రోజుల్లో జరుపుకోబోతున్న ప్రపంచ యోగా దినం ప్రస్తావన తెస్తూ... ప్రపంచానికి తన సంస్కృతిని భారత్‌ అందిస్తూనే ఉందన్నారు. భారత్‌ను విశ్వ జ్ఞాన కేంద్రంగా నిలపడంలో భాగంగా ఇప్పటికే తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు.

అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లు కోటి మందికి పైగా పిల్లలకు సాంకేతిక విషయాలను నేర్పిస్తున్నాయనీ, చంద్రయాన్‌, గగన్‌యాన్‌ మిషన్లు వారి జిజ్ఞాసను పెంచుతున్నాయని మోదీ వివరించారు. ఇదిలా ఉండగా, 12వ శతాబ్దంలో మగధపై దండెత్తిన ఆఫ్ఘాన్లు నలంద వర్సిటీని ధ్వంసం చేశారు. విధ్వంస చరిత్రకు నిదర్శకంగా నలందలో మిగిలిన శిథిల భాగాలను మోదీ బుధవారం పరిశీలించారు. కొత్తగా నలందలో నెలకొల్పిన క్యాంప్‌సను నెట్‌ జీరో పద్ధతిలో గ్రీన్‌ క్యాంపస్‌ రూపంలో దీనిని తీర్చిదిద్దారు. వంద ఎకరాల్లో విస్తరించిన క్యాంప్‌సలో సోలార్‌ ప్లాంట్లు, నీటి శుద్ధి కేంద్రాలు, జల పునర్వినియోగ ప్లాంట్లు, చెరువులు, ఇతర పర్యావరణ అనుకూల ఏర్పాట్లు ఉన్నాయి.

Updated Date - Jun 20 , 2024 | 07:24 AM