Share News

Cheetah: మూడు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చిరుత.. వీడియో ఇదిగో!

ABN , Publish Date - Jan 23 , 2024 | 10:26 AM

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో జ్వాలా అనే నమీబియా చిరుత ప్రసవించింది. చిరుత మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ చిరుత కూనలు పార్క్‌లో సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ చిరుత కూనలు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాయి.

Cheetah: మూడు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చిరుత.. వీడియో ఇదిగో!

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో జ్వాలా అనే నమీబియా చిరుత ప్రసవించింది. చిరుత మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ చిరుత కూనలు పార్క్‌లో సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ చిరుత కూనలు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాయి. తాజాగా పుట్టిన 3 పిల్లలతో కలిపి కునో నేషనల్ పార్క్‌లో మొత్తం చిరుతల సంఖ్యను 20కి చేరింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించారు. చిరుత పిల్లలు పార్క్‌లో సందడి చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేశారు. ‘‘కునో కొత్త పిల్లలు! నమీబియాకు చెందిన జ్వాలా అనే చిరుత మూడు పిల్లలకు జన్మనిచ్చింది. నమీబియా చిరుత ఆషా తన పిల్లలకు జన్మనిచ్చిన కొన్ని వారాల తర్వాత జ్వాలా కూడా ప్రసవించడం గమనార్హం. వన్యప్రాణుల ప్రేమికులందరికీ అభినందనలు. భారత్‌లో వన్యప్రాణులు వృద్ధి చెందాలి.’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.


కాగా నమీబియా నుంచే తీసుకొచ్చిన ఆశా అనే చిరుత కూడా 20 రోజుల క్రితం, ఈ నెల 3న మూడు కూనలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఇదే జ్వాలా చిరుత 2023 మార్చిలో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అప్పుడు ఈ చిరుత పేరు 'సియాయా'గా ఉండేది. కానీ దురదృష్టవశాత్తూ అందులో మూడు పిల్లలు చనిపోయాయి. ఒక ఆడ చిరుత కూన మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడింది. కాగా భూమిపై వేగంగా పరిగెత్తే జంతువు అయిన చిరుతలను భారతదేశంలో 1952లో అంతరిపోతున్న జాతికి ప్రకటించారు. అప్పటినుంచి దేశంలో వాటి జనాభాను పునరుద్దరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే దక్షిణాఫ్రికా, నమీబియా దేశాల నుంచి చిరుతలను కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు. వాటిని కునో నేషనల్ పార్క్‌లో వదులుతున్నారు. ఇందులో భాగంగానే 2022 సెప్టెంబర్ 17న నమీబియా నుంచి 8 మంది చిరుత పిల్లలను తీసుకొచ్చారు. అందులో 5 ఆడ చిరుతలు కాగా.. మూడు మగ చిరుతలు. 2023 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను తీసుకొచ్చారు. గతేడాది డిసెంబర్‌లో 4 చిరుతలను పార్క్‌లోకి వదిలారు. అయితే వాటిలో రెండింటిని పట్టుకుని బోమాస్‌కు తరలించారు.

Updated Date - Jan 23 , 2024 | 10:26 AM