Share News

PM Modi: నవీన్‌ బాబుతో పొత్తు ఎందుకు పెట్టుకోలేదో వెల్లడించిన మోదీ

ABN , Publish Date - May 28 , 2024 | 03:41 PM

ఎన్నికల్లో ఒడిశా ముఖ్యమంత్రితో తనకున్న సత్సంబంధాలను ప్రధాని పక్కకు పెట్టేశారు. దీనికి కారణంపై మోదీ ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూటిగా సమాధానం ఇచ్చారు. ఒడిశా రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ఆపని చేసినట్టు చెప్పారు.

PM Modi: నవీన్‌ బాబుతో పొత్తు ఎందుకు పెట్టుకోలేదో వెల్లడించిన మోదీ

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి ఆసక్తి రేపుతున్న రాష్ట్రాల్లో నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) సారథ్యంలోని బిజూ జనతాదళ్ (BJD) అధికారంలో ఉన్న ఒడిశా (Odisha) ఒకటి. ఈసారి ఒడిశాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) విస్తృత ప్రచారం చేపట్టడంతో పాటు అక్కడి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కమల వికాసం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తొలిసారి బీజేడీ అవినీతి, అభివృద్ధి రహిత పాలనను ఎండగడుతూ విమర్శలు గుప్పించారు. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్న బీజేపీ ఒడిశాలో మాత్రం బీజేడీతో పొత్తుకు దూరంగా ఉంది. ఒడిశా ముఖ్యమంత్రితో తనకున్న సత్సంబంధాలను కూడా ప్రధాని పక్కకు పెట్టేశారు. దీనికి కారణంపై మోదీ ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూటిగా సమాధానం ఇచ్చారు. ఒడిశా రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ఒడిశా సీఎంతో తనకున్న మంచి సంబంధాలను కూడా 'త్యాగం' (Sacrifice) చేసినట్టు చెప్పారు.


''దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతోనూ మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో మనకు శత్రువులనేది ఉండకూడదు. అయితే ఇక్కడ (ఒడిశా) ఒక ప్రశ్న ఉంది. నేను నా సంబంధాలను నిలబెట్టుకోవాలా? ఒడిశా దుస్థితి గూరించి బాధపడలా?. నేను ఒడిశా భవితవ్యం వైపే మొగ్గుచూపాను. నా సంబంధాల గురించి చూసుకుంటే నేను ఒడిశా ప్రజలను త్యాగం చేయాల్సి ఉంటుంది'' అని మోదీ తెలిపారు. తనకు ఎవరి పట్ల శత్రుత్వం లేదని ఎన్నికలు ముగిసిన తర్వాత అందరి నేతలకు నచ్చచెబుతానని మోదీ అన్నారు.


జూన్ 10న బీజేపీ సీఎం ప్రమాణస్వీకారం

ఒడిశాలో జూన్ 10న బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేస్తారని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ''ఒడిశా తలరాత (ఫేట్) మారబోతోంది. ప్రభుత్వం మారనుంది. జూన్ 4న ఒడిశాలోని ప్రస్తుత ప్రభుత్వ గడువు తీరిపోతోంది. జూన్ 10న బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేస్తారు'' అని మోదీ అన్నారు.


25 ఏళ్లుగా ప్రగతి లేదు..

నవీన్ పట్నాయక్ సారథ్యంలోని ఒడిశా ప్రభుత్వాన్ని ప్రధాని టార్గెట్ చేస్తూ, గత 25 ఏళ్లుగా రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకేలేదని చెప్పారు. వ్యవస్థ మొత్తం బందీ అయిందనీ, దాని నుంచి బయటపడితేనే ఒడిశా అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఒడిశాలో ఎన్నో సహజ వనరులు ఉన్నాయని, అయితే ప్రజలు మాత్రం పేదరికంలో మగ్గుతుండటం విచారకరమని అన్నారు. ఇందుకు ప్రభుత్వమే కారణమని, ప్రజలు తమ హక్కులను పొందడంతో పాటు ఒడిశా అస్థిత్వాన్ని నిలబెట్టుకోవాల్సి ఉందని సూచించారు.


దీనికి ముందు, ఒడిశా ఎన్నికల ప్రచారంలోనూ నవీన్‌పై మోదీ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో, వాటి రాజధానులేమిటో కాగితం చూడకుండా నవీన్ బాబు చెప్పగలరా? అని ప్రశ్నించారు. ప్రజల బాధలు ఆయనకు తెలియవని అన్నారు. ''మీ పిల్లల భవిష్యత్తును అలాంటి వ్యక్తుల చేతులో పెడతారా? మాకు ఓ ఐదేళ్లు అవకాశం ఇవ్వమని విజ్ఞప్తి చేస్తు్న్నాను'' అని మోదీ ఒడిశా ప్రజలకు పిలుపునిచ్చారు. దీనికి 2000 నుంచి ఒడిశా సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ సైతం ఘాటు సమాధానం ఇచ్చారు. ఇటీవల భారతరత్న అవార్డులు ఇచ్చినప్పుడు ఒడిశా సాహస పుత్రులను మోదీ ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో చెప్పాలని నిలదీశారు.

For More National News and Telugu News..

Updated Date - May 28 , 2024 | 03:41 PM