National :బెయిల్‌కు ముందు పోలీస్ స్టేషన్‌లో బర్గర్లు, పిజ్జాలు.. రాచమర్యాదలు!
ABN , Publish Date - May 22 , 2024 | 04:58 AM
పుణెలో ఓ బాలుడు (17) మద్యం మత్తులో లగ్జరీ కారును అతి వేగంగా నడిపి... బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను బలిగొన్న ఘటన, రోడ్డు ప్రమాదాలపై 300 పదాల్లో వ్యాసం రాయమంటూ ఆ బాలుడికి 15 గంటల్లోనే స్థానిక కోర్టు బెయిల్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
బెయిల్‌కు ముందు పోలీస్ స్టేషన్‌లో
బర్గర్లు, పిజ్జాలు.. రాచమర్యాదలు!
పుణెలో మద్యం మత్తులో ఇద్దర్ని బలిగొన్న
బాలుడికి వీఐపీ ట్రీట్‌మెంట్
ముంబై/పుణె, మే 21: పుణెలో ఓ బాలుడు (17) మద్యం మత్తులో లగ్జరీ కారును అతి వేగంగా నడిపి... బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను బలిగొన్న ఘటన, రోడ్డు ప్రమాదాలపై 300 పదాల్లో వ్యాసం రాయమంటూ ఆ బాలుడికి 15 గంటల్లోనే స్థానిక కోర్టు బెయిల్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుసుకోగా.. పోలీసులు నిందితుడిని స్టేషన్‌కు తీసుకెళ్లి పిజ్జాలు, బర్జర్లు తినిపించారని, రాచమర్యాదలు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. నిందితుడు బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి కొడుకు కావడంతో పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొంచారన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో పుణె పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ వివరణ ఇచ్చారు. పోలీస్ స్టేషన్‌లో నిందితుడికి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చినట్టు తేలితే సంబంధిత సిబ్బందిపై వేటు తప్పదని పేర్కొన్నారు. ఈ కేసులో కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఈ మేరకు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, హోం మంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఐపీసీ 304, 304(ఏ) సెక్షన్ల కింద నమోదు చేశామన్నారు.
నిందితుడిని మేజర్‌గా పరిగణించేందుకు అనుమతి కోరగా కింది కోర్టు తిరస్కరించిందని, దీనిపై జిల్లా సెషన్స్ కోర్టును ఆశ్రయించామన్నారు. నిందితుడి రక్త పరీక్ష నివేదిక రావలసి ఉందన్నారు. అయితే ప్రమాదానికి ముందు నిందితుడు వెళ్లిన రెండు బార్లకు మంగళవారం పోలీసులు సీల్ వేశారు.
నిందితుడి తండ్రి, ఆ బార్ల యజమానులు, మేనేజర్లు(మొత్తం ఏడుగుర్ని) అరెస్టు చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 24 ఏళ్ల అనీశ్ అవథీయా, అశ్వనీ కోష్టా మధప్రదేశ్‌కు చెందిన వారు. కాగా, నిందితుడైన బాలుడి తండ్రి అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. అతను ఎప్పుడూ వాడే కార్లను వివిధ మర్గాలవైపు పంపాడు. తాను మాత్రం స్నేహితుడి కారు తీసుకొని పారిపోయే ప్రయత్నం చేశాడు. కాని జీపీఎస్ ఆధారంగా పోలీసులు ఆ కారును గుర్తించారు.