Share News

Odisha: 'ఓహ్.. నువ్ నన్ను ఓడించావ్ కదా'.. మాజీ సీఎం, బీజేపీ ఎమ్మెల్యే మధ్య ఆసక్తికర సంభాషణ

ABN , Publish Date - Jun 19 , 2024 | 08:24 AM

తెలంగాణలో కేసీఆర్ రెండు చోట్ల(గజ్వేల్, కామారెడ్డి) పోటీ చేసిన మాదిరిగానే, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కూడా రెండు స్థానాల్లో(హింజిలీ, కాంతాబంజీ) పోటీ చేశారు. అయితే సిట్టింగ్ స్థానం హింజిలీలో నవీన్ గెలుపొందారు. కానీ కాంతాబంజీలో బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ బాగ్‌పై 16,334 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

Odisha: 'ఓహ్.. నువ్ నన్ను ఓడించావ్ కదా'.. మాజీ సీఎం, బీజేపీ ఎమ్మెల్యే మధ్య ఆసక్తికర సంభాషణ

భువనేశ్వర్: సుదీర్ఘ కాలంపాటు ఎమ్మెల్యేగా గెలుస్తూ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న నేతను ఓడిస్తే ఎలా ఉంటుంది. సంచలనమే కదా. అలాంటి సంచలనాలకు గతేడాది తెలంగాణ కేరాఫ్‌గా మారింది. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి వంటి హేమాహేమీలను ఓడించి ఘన విజయం సాధించారు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి. కామారెడ్డి నుంచి బరిలో దిగిన వెంకట రమణా రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు హేమాహేమీలను ఓడించి సంచలనం సృష్టించారు.

అచ్చం ఇలాంటి ఘటనే ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో జరిగింది. తెలంగాణలో కేసీఆర్ రెండు చోట్ల(గజ్వేల్, కామారెడ్డి) పోటీ చేసిన మాదిరిగానే, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కూడా రెండు స్థానాల్లో(హింజిలీ, కాంతాబంజీ) పోటీ చేశారు. అయితే సిట్టింగ్ స్థానం హింజిలీలో నవీన్ గెలుపొందారు. కానీ కాంతాబంజీలో బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ బాగ్‌పై 16,334 ఓట్ల తేడాతో ఓడిపోయారు.


ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థి తొలిసారి ఎమ్మెల్యేగా గెలవగా ఆయనకి 90,876 ఓట్లు పోలయ్యాయి. పట్నాయక్‌కు 74,532 ఓట్లు వచ్చాయి. దీంతో సీఎంను ఓడించిన నేతగా లక్ష్మణ్ సంచలనం సృష్టించారు. ఈ క్రమంలో ఒడిశా అసెంబ్లీలో మంగళవారం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.

నవీన్ పట్నాయక్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి వస్తుండగా.. లక్ష్మణ్ ఎదురు పడ్డారు. ఆయన్ని చూసి నవీన్ నమస్కరిస్తూ.. 'ఓహ్, నువ్ నన్ను ఓడించావ్ కదా. అభినందనలు' అని అన్నారు. లక్ష్మణ్ ప్రతినమస్కారం చేస్తూ.. నవ్వుతూ బదులిచ్చారు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ.. సభలో నవ్వులు పూయించింది.


నవీన్‌కు నీరాజనం...

ఒడిశా అసెంబ్లీలో మరో ఆసక్తికర సన్నీవేశం చోటు చేసుకుంది. నవీన్ ప్రమాణ స్వీకార అనంతరం ముఖ్యమంత్రి మోహన్ చరణ్ ఆయన మంత్రి వర్గం, బీజేపీ ఎమ్మెల్యేలంతా నిల్చుని నవీన్‌కు అభినందనలు తెలిపారు. ఒడిశాకు నవీన్ పట్నాయక్ 24 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా సేవలందించారు.

Updated Date - Jun 19 , 2024 | 08:24 AM