Sharad Pawar: రెండేళ్లలో పలు పార్టీలు కాంగ్రె్‌సలో విలీనం: పవార్
ABN , Publish Date - May 09 , 2024 | 04:20 AM
రాబోయే రెండేళ్లలో పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రె్‌సలో విలీనమవుతాయని లేదా ఆ పార్టీకి మరింత దగ్గరవుతాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, మే 8: రాబోయే రెండేళ్లలో పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రె్‌సలో విలీనమవుతాయని లేదా ఆ పార్టీకి మరింత దగ్గరవుతాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు. ఎన్సీపీ కూడా అదే బాటలో ఉందా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ తమ పార్టీకి, కాంగ్రె్‌సకు ఎలాంటి తేడా లేదని వ్యాఖ్యానించారు. రెండు పార్టీల సిద్ధాంతాలు ఒకటేనని, రెండూ గాంధీ-నెహ్రూ సూత్రాలను ఆచరించేవేనని పేర్కొన్నారు.
శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా భావ సారూప్య పార్టీలతో కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నారని చెప్పారు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవార్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీనిపై మిత్రపక్షమైన శివసేన (యూబీటీ) ఆచితూచి స్పందిస్తూ పవార్ వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొంది. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన ఆప్, సీపీఐ స్పందిస్తూ అది ఆయన సొంత అంచనా మాత్రమేనని వ్యాఖ్యానించాయి.