Share News

Baba Siddique: మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య.. భారీ భద్రతతో ఆస్పత్రికి సల్మాన్ ఖాన్

ABN , Publish Date - Oct 13 , 2024 | 07:39 AM

ముంబైలో ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం సీనియర్ నేత, కాంగ్రెస్ మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ నిన్న రాత్రి హత్యకు గురయ్యారు. ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు బాబా సిద్ధిఖీని కాల్చి చంపారు. క్రైమ్ బ్రాంచ్ ఈ కేసును దర్యాప్తు చేస్తుంది.

Baba Siddique: మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య.. భారీ భద్రతతో ఆస్పత్రికి సల్మాన్ ఖాన్
ncp leader Baba Siddique

ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ(Baba Siddique) ముంబై(mumbai)లో నిన్న హత్యకు గురయ్యారు. బాబా సిద్ధిఖీ తన కుమారుడి కార్యాలయం వెలుపల ఉండగా, శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మోటార్‌సైకిల్‌పై వచ్చిన ముగ్గురు షూటర్లు ఆయనపై ఆరుసార్లు కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన బాబా సిద్ధిఖీని సమీపంలోని లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో అక్కడ ఆయన చనిపోయినట్లు ధృవీకరించారు. అయితే బాబా సిద్ధిఖీ మరణ వార్తను తెలుసుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 18 షూటింగ్‌ను రద్దు చేసుకుని రాత్రికి రాత్రే భారీ భద్రత నడుమ లీలావతి ఆస్పత్రికి చేరుకున్నారు.


సీఎంతోపాటు

సల్మాన్ ఖాన్‌తో పాటు, సీఎం షిండే, అజిత్ పవార్, శిల్పాశెట్టి కుంద్రా బాబా సిద్ధిఖీ కుటుంబాన్ని పరామర్శించేందుకు లీలావతి ఆస్పత్రికి వెళ్లారు. ముంబై రాజకీయాల నుంచి బాలీవుడ్ వరకు బాబా సిద్ధిఖీ ప్రభావం ఉంది. బాబా సిద్ధిఖీ ముంబై సినీ ప్రపంచంలో కూడా బాగా పాపులర్ అయ్యారు. రంజాన్ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీలకు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి నటులు గతంలో హాజరయ్యారు. అంతేకాదు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ కీలక వ్యూహకర్తగా కూడా బాబా సిద్ధిఖీని చూస్తున్నారు.


ప్రాణహాని ఉందని ముందే

ఈ ఘటనపై అప్రమత్తమైన ముంబై పోలీసులు ఇద్దరు షూటర్లను అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు హర్యానాకు చెందిన వారని, మరొకరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారని తెలుస్తోంది. ఒకరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి బుల్లెట్లు, 9MM పిస్టల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన వెనుక లారెన్స్ బిష్ణోయ్ ముఠా హస్తముందని పోలీసులు అనుమానిస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందని 15 రోజుల క్రితమే సిద్దిఖీ తెలియజేశారు. ఆ తర్వాత వై కేటగిరీ భద్రతను కల్పించారు. భద్రత కల్పించినప్పటికీ ఆయన హత్యకు గురికావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


రాజకీయాల్లో

బాబా సిద్ధిఖీ రాజకీయ జీవితం గురించి మాట్లాడితే ఆయన 1999, 2004, 2009లో వరుసగా మూడు సార్లు బాంద్రా వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ క్రమంలో 2004 నుంచి 2008 వరకు ఆహార, పౌర సరఫరాలు, కార్మిక, FDA రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. బాబా సిద్ధిఖీ తన మొత్తం రాజకీయ జీవితాన్ని (సుమారు 48 సంవత్సరాలు) కాంగ్రెస్ పార్టీలో గడిపారు. విద్యార్థి దశలోనే 1977లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన కాంగ్రెస్‌ను వీడారు. ఆయన కుమారుడు జీషన్ సిద్ధిఖీ ప్రస్తుతం బాంద్రా తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన


Read More National News and Latest Telugu News

Updated Date - Oct 13 , 2024 | 07:51 AM