Share News

Lok Sabha polls 2024: అనంతనాగ్-రాజౌరి ఎన్నిక వాయిదా వద్దు.. ఈసీకి మాజీ సీఎంల లేఖ

ABN , Publish Date - Apr 26 , 2024 | 03:09 PM

జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరి లోక్‌సభ నియోజకవర్గంలో జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయనున్నారనే ఊహాగానాల మధ్య ఎన్నికల కమిషన్‌ కు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబాబూ ముఫ్తీ లేఖ రాశారు. ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయవద్దని ఈసీకి ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

Lok Sabha polls 2024: అనంతనాగ్-రాజౌరి ఎన్నిక వాయిదా వద్దు.. ఈసీకి మాజీ సీఎంల లేఖ

శ్రీనగర్: మూడో విడత లోక్‌‍సభ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరి (Anantnag-Rajouri) నియోజకవర్గంలో జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయనున్నారనే ఊహాగానాల మధ్య ఎన్నికల కమిషన్‌ (Election commission)కు నేషనల్ కాన్ఫరెన్స్ (NC) నేత ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah), పీడీపీ (PDP) అధ్యక్షురాలు మెహబాబూ ముఫ్తీ (Mehbooba Mufti) లేఖ రాశారు. ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయవద్దని ఈసీకి ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.


జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులైన ఒమర్, మెహబూబా వేర్వేరు పత్రికా ప్రకటనల్లో ఈసీకి విజ్ఞప్తి చేసిన విషయాన్ని తెలియజేశారు. వాతావరణ ప్రతికూలత కారణంగా ఎన్నికలను వాయిదా వేయాలని కొన్ని పార్టీలు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్ చీఫ్ సెక్రటరీ అటల్ డుల్లూ, చీఫ్ ఎలక్టోరల్ అధికారని ఈసీ నివేదిక కోరింది. ఈ క్రమంలో ఎన్నికలను వాయిదా వేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.


వాయిదా సరికాదు: ఒమర్

ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఈసీ తీసుకోరాదని ఒమర్ అబ్దుల్లా శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. వాయిదా డిమాండ్ అన్ని పార్టీల నుంచి వచ్చినది కాదని, అదీగాక పోటీలో లేని కొందరు వ్యక్తులు ఈసీని ఎన్నికల వాయిదా కోరారని చెప్పారు. తమిళనాడు, లేదా వేరే రాష్ట్రంలోని నియోజకవర్గాల గురించి తాను ఈసీకి లేఖ రాస్తే వాళ్లు నోటీసు ఇస్తారా? అని ప్రశ్నించారు.

Delhi: వీవీప్యాట్లపై పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు.. వ్యవస్థను గుడ్డిగా వ్యతిరేకించవద్దని హితవు


పార్లమెంటుకు రాకుండా చేసేందుకే: మెహబూబా

అనంతనాగ్-రాజౌరీలో ఎన్నికలు వాయిదాకు కొందరు ప్రయత్నిస్తున్నారనే వార్తలపై మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. వాళ్లంతా తనపై ముఠా కట్టారని, తనను పార్లమెంటులో చూడకూడదని వారు కోరుకుంటున్నారని ఆరోపించారు. పార్టీలు, మతాలకు అతీతంగా ప్రజలంతా తనకు మద్దతిస్తున్నారని, ఆ కారణంగానే ఎన్నికల వాయిదాకు, రిగ్గింగ్‌కు యోచన చేస్తున్నారని తన రాజకీయ ప్రత్యర్థులపై ఆమె విమర్శలు గుప్పించారు. ఎన్నికలు వాయిదా వేయడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఆమె నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు. 1987 అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరగడం, మిలటరీని దింపడం వంటివి చోటుచేసుకున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. జమ్మూకశ్మీర్ ఎంతో కోల్పోవడంతో పాటు ఎన్నికల కమిషన్‌పై విశ్వాసం కూడా సన్నగిల్లిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఎలాంటి అడ్వెంచర్ (వాయిదా నిర్ణయం) చేయవద్దని ఆమె కోరారు.


ఈసీ నిర్ణయమే ఫైనల్: జితేంద్ర సింగ్

కాగా, అనంతనాగ్-రౌజౌరి ఎన్నికల రీషెడ్యూల్ అంశంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ను ప్రశ్నించగా, ఈసీ స్వతంత్ర సంస్థ అని తెలిపారు. ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి బీజేపీ కట్టుబడి ఉంటుందని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం మే 7న మూడో విడత ఎన్నికల్లో భాగంగా అనంతనాగ్-రాజౌరి నియోజకవర్గంలో పోలింగ్ జరగాల్సి ఉంది. 21 మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీలో ఉన్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 26 , 2024 | 03:12 PM