Lok Sabha Elections: వాళ్లెంత ఆడిపోసుకున్నా శక్తిమాత అనుగ్రహమే నన్ను కాపాడుతోంది: మోదీ
ABN , Publish Date - May 10 , 2024 | 03:52 PM
మొఘల్ రాజు ఔరంగజేబ్‌తో తనను పోలుస్తూ శివసేన నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. ఎవరెంతగా ఆడిపోసుకున్నా శక్తిమాత ) అనుగ్రహం తనకు రక్షణ కవచంలా నిలుస్తోందని అన్నారు.
నందూర్బార్: మొఘల్ రాజు ఔరంగజేబ్‌తో తనను పోలుస్తూ శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఘాటుగా స్పందించారు. ఎవరెంతగా ఆడిపోసుకున్నా శక్తిమాత (Matri-shakti) అనుగ్రహం తనకు రక్షణ కవచంలా నిలుస్తోందని అన్నారు. ''సజీవంగా ఉన్నా, మరణాంతరం సైతం నన్ను ఎవరూ పాతిపెట్టలేరు'' అని మహారాష్ట్రలోని నందూర్బార్‌లో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ వ్యాఖ్యానించారు.
సంజయ్ రౌత్ ఏమన్నారు?
సంజయ్ రౌత్ ఇంతకుముందు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీపై 'ఔరంగజేబ్' వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబ్ గుజరాత్‌లో పుట్టారని, మోదీ, అమిత్‌షా ఇద్దరూ కూడా గుజరాత్ నుంచే వచ్చారని, ఔరంగజేబ్‌లా వ్యవహరిస్తున్నారని అన్నారు. ''చరిత్ర చూస్తే నరేంద్ర మోదీ గ్రామం నుంచే ఔరంగజేబ్ పుట్టాడు. అహ్మదాబాద్ పక్కనే ఉన్న దహోద్ గ్రామంలో ఔరంగజేబ్ పుట్టారు. గుజరాత్‌లో పుట్టినందునే వాళ్లు (మోదీ, అమిత్‌షా) ఔరంగజేబ్‌లా వ్యవహరిస్తున్నారు. కానీ, చరిత్ర గుర్తుకు తెచ్చుకుంటే మహారాష్ట్రలో గడ్డపైనే ఔరంగజేబ్‌ను పూడ్చిపెట్టారు. మహారాష్ట్రను పట్టుకునేందుకు ఔరంగజేబ్ 27 ఏళ్ల పాటు యుద్ధం చేశాడు. చివరికి ఆయనను మహారాష్ట్రలోనే పూడ్చిపెట్టారు. నరేంద్ర మోదీ హు ఆర్ యూ?'' అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు.
Lok Sabha Elections: నవనీత్ కౌర్‌పై కేసు నమోదు
తిప్పికొట్టిన మోదీ..
సంజయ్ రౌత్ వ్యాఖ్యలను మోదీ తిప్పికొడుతూ, బుజ్జగింపు రాజకీయాల కోసమే విపక్షాలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాయని అన్నారు. శివసేన (యూబీటీ)ను 'నకిలీ శివసేన'గా ఆయన అభివర్ణించారు. ''నకిలీ శివసేన నన్ను సజీవంగా పూడ్చిపెడతామంటోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 'మోదీ తేరి కబ్రా ఖుదేగి' అంటోంది. బుజ్జగింపు రాజకీయాల కోసమే వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తు్నారు. ఇదంతా చూస్తే బాలాసాహెబ్ థాకరే ఆత్మ ఎంతగా క్షోభిస్తోందోననే బాధ కలుగుతోంది'' అని మోదీ అన్నారు. 1993 ముంబై పేలుళ్ల నిందితుడు ఇక్బాల్ ముసా అలియాస్ బాబా చౌహాన్‌ను వాయవ్య ముంబై అభ్యర్థి అమోల్ కీర్తికర్ తరఫున ప్రచారానికి శివసేన యూబీటీ వాడుకుంటోందని ఆయన ఆక్షేపించారు. కాగా, లోక్‌సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ మే 13న జరుగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.