PM Narendra Modi: జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 04 , 2024 | 05:39 PM
బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే కూటమి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తనకు ఇది రెండవ ర్యాలీయే అయినప్పటికీ రాష్ట్రంలో గెలుపుపై ఇప్పటికే నమ్మకం కలిగిందని విశ్వాసం వ్యక్తం చేశారు.
చాయ్‌బస, జార్ఖండ్: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారం మరింత ఊపందుకుంది. ప్రధాన పార్టీలన్నీ ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇక ఎన్డీయే కూటమి ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రాష్ట్రంలోని ఛాయ్‌బస పట్టణంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే కూటమి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తనకు ఇది రెండవ ర్యాలీయే అయినప్పటికీ గెలుపుపై ఇప్పటికే నమ్మకం కుదిరిందని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘ ఎన్నికల ప్రచారం కోసం తొలిసారి ఇక్కడి వచ్చాను. ఇది నాకు రెండవ ఎన్నికల ర్యాలీ. ఈ రెండు ర్యాలీలు చూసిన తర్వాత.. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సగాని కంటే ఎక్కువ సీట్లను బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే కూటమి గెలుచుకుంటుందని నేను నమ్మకంతో చెప్పగలను’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. గిరిజన సోదర, సోదరీమణుల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ ఏవిధంగా పనిచేస్తోందో మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక కేంద్రంలో బీజేపీ తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు గిరిజన సమాజం కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని ప్రస్తావించారు.
గిరిజన అక్కచెల్లెళ్లు, అన్నదమ్ముళ్ల ఆత్మ గౌరవమే బీజేపీకి అత్యంత ముఖ్యమైనదని మోదీ అన్నారు. అందుకే తొలిసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు గిరిజనుల కోసం రాష్ట్రాన్ని ఇచ్చామని అన్నారు. ఢిల్లీ నుంచి పని చేసే అవకాశం అటల్ బిహారీ వాజ్‌పేయికి దక్కిందని, ఆయన హయాంలోనే గిరిజన రాష్ట్రాలు ఏర్పడ్డాయని మోదీ గుర్తుచేశారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు వాజ్‌పేయి హయాంలోనే ఏర్పాటు అయ్యాయని మోదీ చెప్పారు.
ఇక రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సమస్యల పరిష్కారంపై దృష్టిసారిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ధరలు తగ్గించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక చట్టవిరుద్ధంగా గిరిజన కూతుళ్ల నుంచి గుంజుకున్న భూములను వెనక్కి ఇప్పిస్తామని మోదీ హామీ ఇచ్చారు.
జార్ఖండ్ రాష్ట్ర గుర్తింపును మసక బార్చుతున్నారని జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమిపై మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. జార్ఖండ్ గుర్తింపు మార్చివేసే కుట్ర జరుగుతోందని మోదీ అన్నారు. రాష్ట్రంలో చొరబాటుదారులకు జేఎంఎం-కాంగ్రెస్- ఆర్జేడీ మద్దతిస్తున్నాయని అన్నారు. ‘‘చొరబాటుదారులే వారి అతిపెద్ద ఓటు బ్యాంక్. జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలు చొరబాటుదారుల కోసం ఫేక్ సర్టిఫీకేట్లు తయారు చేస్తున్నాయి. గిరిజన ఆడబిడ్డలను చొరబాటుదారులు టార్గెట్‌గా చేసుకుంటున్నారు. ఆడ కూతుళ్ల నోటి కాడా కూడు, భూమి లాక్కుంటున్నారు. అంతేకాదు జేఎంఎం, కాంగ్రెస్ కూటమి స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలను మైనారిటీ ఇన్‌స్టిట్యూషన్లను ప్రకటిస్తున్నాయి. ఈ విద్యా సంస్థల్లో దళితులు, గిరిజనులు, ఓబీసీల రిజర్వేషన్లకు ముగింపు పలుకుతున్నాయి’’ అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.