BJP: బీజేపీ పాలిత సీఎంలతో అధిష్ఠానం కీలక సమావేశం.. సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:20 AM
బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో అధిష్ఠానం ఇవాళ్టి నుంచి రెండు రోజులపాటు సమావేశంకానుంది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జులై 28న ఉదయం ఈ సమావేశం ప్రారంభమైంది.
ఢిల్లీ: బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో అధిష్ఠానం ఇవాళ్టి నుంచి రెండు రోజులపాటు సమావేశంకానుంది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జులై 28న ఉదయం ఈ సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు సీనియర్ నేతలు ఇందులో పాల్గొన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అమలు తీరుపై నేతలు చర్చించనున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. పేదల కోసం మోదీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును చర్చించనున్నారు. రెండు రోజులపాటు దాదాపు 8 గంటలపాటు ఈ సమావేశం జరగనుంది.
2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ అతిపెద్ద సమావేశం ఇదే. "మా పార్టీ మరింత సుపరిపాలన అందించడానికి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోంది" అని జేపీ నడ్డా ఎక్స్‌లో పేర్కొన్నారు. మోదీతోపాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, సీఎంలు యోగీ ఆదిత్యనాథ్ (ఉత్తరప్రదేశ్), హిమంత బిస్వా శర్మ (అసోం), భజన్‌లాల్ శర్మ (రాజస్థాన్), మోహన్ చరణ్ మాఝీ (ఒడిశా) తదితరులు హాజరయ్యారు. మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, హర్యానా, మణిపూర్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు కూడా ఇందులో పాల్గొన్నారు.
ప్రతిపక్షాల విమర్శలపై చర్చ..
ఇటీవల ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూలకు అధిక మొత్తంలో నిధులు కేటాయించారని ఆరోపిస్తూ ఇండియా కూటమి నేతలు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే సమావేశంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అనేక సీట్లు కోల్పోవడం ఆ పార్టీకి మింగుడుపడటం లేదు. అంచనాలను అందుకోలేకపోవడం, ఈ ఏడాది చివర్లో వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా బీజేపీ అధిష్ఠానం చర్చించనుంది. చివరిసారిగా ఫిబ్రవరిలో ఈ సమావేశం జరిగింది.
త్వరలో ఉక్రెయిన్‌లో పర్యటించనున్న మోదీ..
వచ్చేనెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 23 లేదా 24 తేదీన మోదీ కీవ్ వెళ్తారని, ఆ దేశ అధ్యక్షుడు జెలన్‌స్కీతో భేటీ అవుతారని సమాచారం. ఆ తర్వాత ఆయన పోలాండ్ పర్యటనకు వెళ్తారని తెలిసింది. 2022లో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక మోదీ ఉక్రెయిన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. కాగా, ఈనెల 8న మోదీ రెండు రోజుల పర్యటనకు రష్యా వెళ్లి, ఆ దేశ అఽధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే.