ఉక్రెయిన్, పశ్చిమాసియాలో శాంతిస్థాపనకు కృషి చేస్తాం
ABN , Publish Date - Oct 26 , 2024 | 03:32 AM
ఉక్రెయిన్, పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఈ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు.
యుద్ధాలతో సమస్యలు పరిష్కారం కావు
జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్‌తోభేటీలో మోదీ
న్యూఢిల్లీ, అక్టోబరు 25: ఉక్రెయిన్, పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఈ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. భారత్- జర్మనీ 7వ ‘ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ)’ చర్చల్లో భాగంగా మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన జర్మన్ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్‌తో శుక్రవారం మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఉక్రెయిన్, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. వీలైనంత త్వరగా వీటికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కృషి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది. యుద్ధాల వల్ల సమస్యలు పరిష్కారమవుతాయని భారత్ ఎప్పటికీ విశ్వసించదు’’ అని చెప్పారు.
ప్రపంచవ్యాప్తం గా ఉద్రిక్తతలు, విభేదాలు ముసురుకున్నప్పటికీ భారత్, జర్మనీల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరుదేశాల అభివృద్ధికి బలమైన పునాదిగా మారిందని పేర్కొన్నారు. ఈ రెండు దేశాల మధ్య భాగస్వామ్యం కేవలం లావాదేవీలకే పరిమితం కాలేదన్నారు. రెండు బలమైన ప్రజాస్వామ్య దేశాల పరివర్తనకు నిదర్శనంగా నిలిచిందని చెప్పారు. జర్మనీ ప్రకటించిన ‘ఫోకస్ ఆన్ ఇండియా’ను మోదీ స్వాగతించారు.
ఇరుదేశాల భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 18వ ఆసియా-పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్-2024 సదస్సులో మోదీ మాట్లాడుతూ.. ఓ వైపు సీఈవో ఫోరం సమావేశం జరుగుతుండగా, మరోవైపు ఇరుదేశాల నౌకాదళాలు సంయుక్త విన్యాసాలు చేస్తున్నాయని చెప్పారు. జర్మనీ, భారత్ దేశాల మధ్య ఉన్న స్నేహ బంధం అన్ని రంగాల్లోనూ మరింత బలోపే తం అవుతోందని తెలిపారు. భారతీయ నిపుణులకు ఏటా ఇచ్చే వీసాల సంఖ్యను 20 వేల నుంచి 90 వేలకు పెంచాలన్న జర్మనీ నిర్ణయంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది జర్మనీ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందన్న విశ్వాసం తనకుందన్నారు. భారత్, జర్మనీల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ ఏడాదితో 25 ఏళ్లు పూర్తవుతాయని.. మరో 25 ఏళ్లలో ఇది మరింత ఉన్నత శిఖరాలకు చేరుతుందని పేర్కొన్నారు. ఐరాస భద్రతామండలితో సహా పలు అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
భారత ప్రయత్నాలు అభినందనీయం: ఒలాఫ్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా చూసి, శాంతిని నెలకొల్పేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను ఒలాఫ్ అభినందించారు. అన్ని భాగస్వామ్యపక్షాలతో చర్చించి శాంతిస్థాపనకు భారత్ ఎంతగానో ప్రయత్నిస్తోందని కొనియాడారు. ఈ విషయంలో భారత్‌కు మద్దతుగా నిలుస్తామన్నారు. కాగా, మహారాష్ట్రకు చెందిన భవేశ్, ధారా షా దంపతుల కుమార్తె అరిహా షా (3)ను మూడేళ్లుగా జర్మనీలోని ఫోస్టర్ కేర్‌లో ఉంచుతున్న విషయాన్ని ఒలా్‌ఫతో భేటీలో ప్రధాని మోదీ ప్రస్తావించినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. శారీరకంగా హింసించారన్న ఆరోపణలతో బాలికను 36 నెలలుగా తల్లిదండ్రులకు అప్పగించకుండా ఫోస్టర్ కేర్‌లోనే ఉంచుతున్నారు. ఈ అంశాన్ని తాను పరిశీలిస్తానని ఒలాఫ్.. మోదీకి హామీ ఇచ్చినట్లు మిస్రీ వెల్లడించారు.