Share News

PM Modi : కేరళకు అండగా ఉంటాం

ABN , Publish Date - Aug 11 , 2024 | 04:25 AM

కొండచరియలు విరిగిపడి వరదలు పోటెత్తటంతో అతలాకుతలమైన కేరళకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు.

PM Modi : కేరళకు అండగా ఉంటాం

  • పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాని హామీ

  • విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

  • పునరావాస ప్రణాళికపై సమీక్ష

వయనాడ్‌, ఆగస్టు 10: కొండచరియలు విరిగిపడి వరదలు పోటెత్తటంతో అతలాకుతలమైన కేరళకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు.

ప్రకృతి విపత్తులో కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి అండగా ఉంటామన్నారు. కేరళలో ప్రధాని మోదీ శనివారం ఏరియల్‌ సర్వే జరిపారు. చూరల్‌మల, ముందక్కై, పంచరిమట్టం తదితర ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని వీక్షించారు. అనంతరం వయనాడ్‌లోని కాల్పెట్టాలో దిగి రోడ్డు మార్గంలో చూరల్‌మలకు వెళ్లారు. అక్కడ సహాయకచర్యల్లో భాగంగా ఆర్మీ నిర్మించిన 190 అడుగుల బెయిలీ బ్రిడ్జిపై నడిచి పరిసరాల్లో సంభవించిన నష్టాన్ని పరిశీలించారు.

స్థానికంగా ఏర్పాటైన పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కోల్పోయిన కుటుంబసభ్యులను, జరిగిన నష్టాన్ని తల్చుకొని కన్నీరుమున్నీరైన పలువురిని ప్రధాని మోదీ ఓదార్చారు. గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా మోదీ పలకరించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బాధితులకు పునరావాసం కల్పించే ప్రణాళికపై మాట్లాడారు.

కేరళలో విపత్తు సంభవించిన నాటి నుంచి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుంటున్నానని, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ ఖాన్‌, సీఎం విజయన్‌, కేంద్రమంత్రి సురేష్‌గోపి తదితరులు ప్రధాని పర్యటనలో పాల్గొన్నారు.


మణిపూర్‌ను కూడా మోదీ సందర్శించాలి

ప్రధాని కేరళ పర్యటనపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘కేరళలో దారుణమైన విషాదం సంభవించింది. నాన్‌-బయలాజికల్‌ ప్రధాని వయనాడ్‌కు వెళ్లటం మంచిదే. దీని తర్వాత ఆయన యుద్ధాన్ని మరోసారి నిలిపివేయటానికి ఉక్రెయిన్‌కు వెళ్లనున్నారు.

అయితే, గత 15 నెలలుగా తీవ్రమైన బాధ, దుఃఖంలో ఉన్న మణిపూర్‌ వెళ్లటానికి కూడా ఆయనకు సమయం దొరుకుతుందని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. కాగా, వయనాడ్‌ విషాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ.. జాతీయ విపత్తుగా ప్రకటించటానికి సంబంధించి ప్రత్యేకంగా ఎటువంటి నిబంధనలు లేవని పేర్కొన్నాయి.

ఈ మేరకు 2013లో యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి కేంద్రమంత్రి ఎం.రామచంద్రన్‌ లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానాన్ని గుర్తు చేశాయి. ప్రకృతి విపత్తుల సమయంలో సహాయ పునరావాసాల బాధ్యత ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుందని, అవసరాల మేరకు కేంద్రం సాయమందిస్తుందని నాడు మంత్రి చెప్పారు.

Updated Date - Aug 11 , 2024 | 04:25 AM