PM Modi: ఎన్డీయే నేతలతో మోదీ బలప్రదర్శన...ఎవరేమన్నారంటే?
ABN , Publish Date - May 14 , 2024 | 03:01 PM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు వారాణాసి నుంచి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎన్డీయే భాగస్వామ్య నేతలతో కలెక్టరేట్ కార్యాలయం వెలుపల బలప్రదర్శన చేశారు. ఎన్డీయే కూటమి నేతలు తమ సంఘీభావాన్ని చాటుతూ మోదీ నాయకత్వంలో పనిచేయడం పట్ల హర్షం ప్రకటించారు.
వారణాసి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మంగళవారంనాడు వారాణాసి (Varanasi) నుంచి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎన్డీయే (NDA) భాగస్వామ్య నేతలతో కలెక్టరేట్ కార్యాలయం వెలుపల బలప్రదర్శన చేశారు. ఎన్డీయే కూటమి నేతలు తమ సంఘీభావాన్ని చాటుతూ మోదీ నాయకత్వంలో పనిచేయడం పట్ల హర్షం ప్రకటించారు. ఎన్డీయే కూటమి నేతల బలప్రదర్శనలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా 25 మంది ఎన్డీయే నేతలు పాల్గొన్నారు.
జూన్ 4తో మూడో టర్మ్: హర్దీప్ సింగ్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై కేంద్రం మంత్రి హర్దీప్ సింగ్ పురి ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ నాయకత్వంలో భారతదేశం రాబోయే రెండు మూడేళ్లలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నట్టు చెప్పారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి వంటిదన్నారు. జూన్ 4వ తేదీతో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడో టర్మ్ మొదలవుతుందని అన్నారు.
ఎన్డీయే ఐక్యతే మా బలం: చిరాగ్ పాశ్వాన్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో ఎన్డీయే పార్టీలు మొత్తం హాజరైనట్టు ఎల్‌జేపీ రామ్ విలాస్ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. ఐక్యతే ఎన్డీయే బలమని పేర్కొన్నారు. తాము ఐక్యంగానే 400కు పైగా ఎంపీ సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్డీయేలో భాగస్వామి కావడం అదృష్టం: పవన్ కల్యాణ్
ఎన్డీయే భాగస్వామి కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. తాను వ్యక్తిగతంగా మోదీ అభిమానినని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే క్లీన్ స్వీప్ సాధించనున్నట్టు తెలిపారు.
మోదీ నామినేషన్ చరిత్రాత్మకం: ఏక్‌నాథ్ షిండే
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ వేసిన ఈరోజు చరిత్రాత్మకమని, ఆయన మూడోసారి ప్రధాని కానున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. ప్రజలు మోదీకి ఓటు వేసేందుకు ఎంతో ఉత్సుకతతో ఉన్నారని చెప్పారు. మహారాష్ట్రలోనూ 45 సీట్ల టార్గెట్‌ను తాము సాధించనున్నామని చెప్పారు.
400 సీట్లు పైనే: ఉపేంద్ర కుష్వాహ
దేశవ్యాప్తంగా ఎన్డీయే 400 సీట్లు సాధించడానికి సిద్ధంగా ఉందని, బీహార్‌లోని మొత్తం 40 సీట్లు తాము గెలుచుకుంటామని రాష్ట్రీయ లోక్‌మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహ తెలిపారు.
హ్యాట్రిక్ ప్రధాని మోదీ: జితిన్ రామ్ మాంఝీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ వేసే శుభతరుణంలో తాను వారణాసి రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు హిందుస్థాన్ అవామ్ మోర్చా నేత జితిన్ రామ్ మాంఝీ తెలిపారు. ఈసారి మోదీ 400 సీట్లు సాధించి, మూడోసారి ప్రధాని కానున్నారని అన్నారు.
PM Modi Live: వారణాసిలో నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోదీ
వారణాసి నుంచి భారీ మెజారిటీ: పశుపతి కుమార్ పరస్
ఈరోజు చాలా శుభదినమని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి భారీ మెజారిటీ మూడోసారి గెలుపొందనున్నారని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ చీఫ్ పశుపతి కుమార్ పరస్ అన్నారు.
బీజేపీపై ప్రజల నమ్మకం చెక్కుచెదరలేదు: రాందాస్ అథవాలే
బీజేపీపై ప్రజలకు బలమైన విశ్వాసం ఉందని, ఎన్డీయే తప్పనిసరిగా 400కు పైగా సీట్లు గెలుస్తుందని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే చెప్పారు. వారణాసి సిట్టంగ్ ఎంపీగా బీజేపీ నుంచి మోదీ మూడోసారి నామినషన్ వేశారని, జూన్ 1న జరిగే చివరి విడత ఎన్నికల్లో భాగంగా వారణాసిలో పోలింగ్ జరుగుతుందని అన్నారు.
గతంకంటే భిన్నమైన వాతావరణం: అతుల్ బోరా
ప్రధాని మోదీ నామినేషన్ దాఖలుకు హాజరుకావడం గర్వంగా భావిస్తున్నట్టు అసోం గణ పరిషత్ అధ్యక్షుడు, అసోం మంత్రి అతుల్ బోరా అన్నారు. గత పర్యాయం కూడా తాము ఇక్కడకు వచ్చామని, అయితే ఈసారి వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉందని, ప్రజలు ఎంతో ఉత్సాహంతో బీజేపీకి, మోదీకి మద్దతుగా ఉన్నారని చెప్పారు.
Read Latest Telangana News and National News