Parliament Budget Session: ఆసియా క్రీడల్లో భారత ప్రదర్శనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసల జల్లు
ABN , Publish Date - Jan 31 , 2024 | 01:06 PM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం మొదలయ్యాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఆమె కీలక ప్రసంగం ఇచ్చారు. ఈ సందర్భంగా గత కొన్నేళ్లలో దేశం సాధించిన పలు విజయాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. విజయాలకు సంబంధించి ప్రభుత్వం చూపిన చొరవను ఆమె ప్రశంసించారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం మొదలయ్యాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఆమె కీలక ప్రసంగం ఇచ్చారు. ఈ సందర్భంగా గత కొన్నేళ్లలో దేశం సాధించిన పలు విజయాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. విజయాలకు సంబంధించి ప్రభుత్వం చూపిన చొరవను ఆమె ప్రశంసించారు. చైనాలోని హాంగ్‌జౌలో గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు సాధించిన విజయాలను ద్రౌపది ముర్ము గుర్తుచేశారు. 2018లో ఇండోనేషియాలోని జకార్తా, పాలెంబాంగ్‌లలో గెలిచిన 70 కంటే ఎక్కువగా భారత్ 107 పతకాలు సాధించిందని ఆమె ప్రశంసించారు. భారత ప్లేయర్లు సునాయాసంగా 100కి పైగా పతకాలను సాధించి చరిత్ర సృష్టించారని కొనియాడారు. 2018 ఆసియా క్రీడల్లో 8వ స్థానంలో నిలిచిన భారత్ గతేడాది క్రీడల్లో నాలుగవ స్థానంలో నిలిందని గుర్తుచేశారు. పతకాల పట్టికలో చైనా, జపాన్, దక్షిణ కొరియా తర్వాతి స్థానంలో ఇండియా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు.
కాగా హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలతో మొత్తం 107 మెడల్స్ సాధించింది. ఆసియా క్రీడల్లో ఆటగాళ్లు అద్భుతంగా ఆడారని, దేశానికి ఇదొక సఫలీకృత ప్రయత్నమని మెచ్చుకున్నారు. గతేడాది భారత్ విజయాలతో నిండిందని, అనేక విజయాలు ఉన్నాయని ఆమె ప్రస్తావించారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని ప్రస్తావించారు. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొట్టమొదటి దేశంగా నిలిచిందన్నారు. జీ20 సమ్మిట్‌ను భారత్ విజయవంతంగా నిర్వహించిందని చెప్పారు. ఆసియా గేమ్స్‌లో 100కు పైగా పతకాలు, అటల్ టన్నెల్ ప్రారంభంతో పాటు పలు విజయాలను ఆమె పేర్కొన్నారు.