Share News

PSLV-C58: మరికాసేపట్లో పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం

ABN , Publish Date - Jan 01 , 2024 | 07:15 AM

చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌1 ప్రతిష్ఠాత్మక మిషన్లను విజయవంతంగా ప్రయోగించి 2023 ఏడాదిని ఘనంగా ముగించిన ఇస్రో.. కొత్త ఏడాదిని అదిరిపోయే విజయంతో ఆరంభించాలని ఉవ్విళ్లూరుతోంది.

PSLV-C58: మరికాసేపట్లో పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం

సూళ్లూరుపేట, డిసెంబరు 31: చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌1 ప్రతిష్ఠాత్మక మిషన్లను విజయవంతంగా ప్రయోగించి 2023 ఏడాదిని ఘనంగా ముగించిన ఇస్రో.. కొత్త ఏడాదిని అదిరిపోయే విజయంతో ఆరంభించాలని ఉవ్విళ్లూరుతోంది. 2024 ఆరంభం రోజునే పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్‌ ద్వారా ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహం (ఎక్స్‌పోశాట్‌) ప్రయోగానికి ఏర్పాట్లు చేసింది. దీంతోపాటు మరో పది బుల్లి ఉపగ్రహాలను కూడా తక్కువ భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌ అంతరిక్ష కేంద్రం నుంచి సోమవారం ఉదయం 9:10 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది.


దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభించారు. కౌంట్‌డౌన్‌ జరిగే సమయంలో రాకెట్‌కు ఇంధనాన్ని నింపి, గ్యాస్‌ ఫిల్లింగ్‌ చేశారు. రాకెట్‌లోని అన్ని వ్యవస్థల పనితీరును శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించి ప్రయోగానికి సిద్ధం చేశారు. ఇస్రో ప్రయోగిస్తున్న తొలి పోలారిమెట్రీ మిషన్‌ ఇదే. అమెరికాకు చెందిన నాసా 2019లో చేపట్టిన ఇమేజింగ్‌ ఎక్స్‌-రే పోలారిమెట్రీ ఎక్స్‌ప్లోరర్‌ (ఐఎక్స్‌పీఈ) తర్వాత మరో దేశం చేపడుతున్న పోలారిమెట్రీ మిషన్‌ ఇదే కావడం గమనార్హం. ఎక్స్‌-రే మూలాలను అన్వేషించడం ఈ ఉపగ్రహ ప్రధాన లక్ష్యం. దీని ద్వారా విశ్వంలోని బ్లాక్‌ హోల్స్‌, భారీ నక్షత్రాలను అధ్యయనం చేయనున్నారు.

Updated Date - Jan 01 , 2024 | 07:15 AM