Schools Closed: వణికిస్తోన్న చలి.. పాఠశాలలకు వారం రోజులు సెలవులు
ABN , Publish Date - Jan 08 , 2024 | 07:32 AM
పంజాబ్ రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. చల్లని వాతావరణం కారణంగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఉదయం వేళలో పొగమంచు కమ్మేస్తోంది. దీంతో బయటికి అడుగుపెట్టాలంటేనే జనాలు వణికిపోతున్నారు.
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. చల్లని వాతావరణం కారణంగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఉదయం వేళలో పొగమంచు కమ్మేస్తోంది. దీంతో బయటికి అడుగుపెట్టాలంటేనే జనాలు వణికిపోతున్నారు. పొగమంచు కారణంగా సూర్యోదయం ఆలస్యం కావడంతో ఉదయం వేళలో ప్రజలు బయటికి రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు సరిగ్గా కనిపించక వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చల్లటి వాతావరణంలో ఉదయాన్నే పాఠశాలలకు వెళ్లడానికి విద్యార్థులు అపోసోపాలు పడుతున్నారు. దీంతో పరిస్థితులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు వారం రోజులపాటు సెలవులు ప్రకటించింది. 10వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ నెల 8 నుంచి 14 వరకు సెలవులను మంజూరు చేసింది. ఈ మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
‘‘ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలోని 10వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను జనవరి 8 నుంచి 14 వరకు మూసివేయాలని ఆదేశిస్తున్నాను.’’ అని తెలిపారు. పంజాబ్‌లో ఆదివారం కూడా చల్లటి వాతావరణ పరిస్థితులు కొనసాగాయి. ఉదయం పొగమంచు కారణంగా అనేక ప్రాంతాల్లో దృశ్యమానత తగ్గిపోయింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం అమృత్‌సర్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు 5.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. లూథియానా, పటియాలా, పఠాన్‌కోట్, బటిండా, ఫరీద్‌కోట్, గురుదాస్‌పూర్‌లలో కూడా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 6 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి.