Share News

Congress: ఏ సీటు వదులుకుంటారు.. రాహుల్ గాంధీ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

ABN , Publish Date - Jun 06 , 2024 | 09:20 AM

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పోటీ చేసిన కేరళలోని వయనాడ్, యూపీలోని రాయ్ బరేలీ రెండింటిలోనూ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. నియమాల ప్రకారం ఒకే వ్యక్తి రెండు స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహించకూడదు. ఈ నేపథ్యంలో ఆయన ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది.

Congress: ఏ సీటు వదులుకుంటారు.. రాహుల్ గాంధీ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పోటీ చేసిన కేరళలోని వయనాడ్, యూపీలోని రాయ్ బరేలీ రెండింటిలోనూ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. నియమాల ప్రకారం ఒకే వ్యక్తి రెండు స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహించకూడదు. ఈ నేపథ్యంలో ఆయన ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో ఏ స్థానానికి ఎంపీగా కొనసాగుతారు, ఏ స్థానాన్ని వదులుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

వయనాడ్‌ను వదులుకొని రాయ్‌బరేలీలోనే ఆయన కొనసాగే అవకాశాలు ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు పలు కారణాలు చెబుతున్నారు. 80 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌ దేశ రాజకీయాల్లో చాలా కీలకమైనది. కొన్నేళ్లుగా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ మనుగడే కష్టంగా మారింది. తాజా ఎన్నికల్లో ఆరు స్థానాలు సాధించి మళ్లీ బలపడే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం రాహుల్ రాయ్ బరేలీ నుంచి మాత్రమే ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. ఆయన రాయ్‌బరేలీలో 3 లక్షల ఓట్లకు పైగా, వయనాడ్‌లో రెండోసారి 3.64లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.


రాయ్‌బరేలీ కాదంటే మరో ప్రణాళిక..

అయితే వయనాడ్ సీటు నుంచే రాహుల్ ప్రాతినిధ్యంవహిస్తే.. రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ని పోటీకి దింపే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో రాహుల్, ప్రియాంకలు కాంగ్రెస్ పార్టీ గణనీయమైన సీట్లలో ప్రభావం చూపించడంలో కీలకంగా వ్యవహరించారు. ప్రియాంక ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు మంచి అవకాశం వచ్చింది. వాస్తవానికి ఈ సీటు సోనియాగాంధీది. అయితే ఆరోగ్యరీత్యా ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కాబట్టి ఆ స్థానంలో ప్రియాంకను రంగంలోకి దించే అవకాశాలు లేకపోలేదు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 06 , 2024 | 09:20 AM