Share News

Rahul Gandhi : నా వ్యాఖ్యలపై దుష్ప్రచారం

ABN , Publish Date - Sep 22 , 2024 | 04:36 AM

అమెరికా పర్యటనలో సిక్కులను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు.

Rahul Gandhi : నా వ్యాఖ్యలపై దుష్ప్రచారం

  • అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై రాహుల్‌ స్పందన

న్యూఢిల్లీ/జమ్ము-బెంగళూరు, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): అమెరికా పర్యటనలో సిక్కులను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. అమెరికాలో తాను చేసిన వ్యాఖ్యలపై అధికార బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తుందని, తన నోరు మూయించాలని అనుకుంటోందని శనివారం ఎక్స్‌ పోస్టులో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రతి సిక్కు, ప్రతి భారతీయుడూ.. నిర్భయంగా తన మతాన్ని ఆచరించే దేశం భారత్‌ కాకూడదా? నిజం వైపు నిలబడ లేని బీజేపీ.. నా నోరు మూయించాలని అనుకుంటోంది.

అమెరికాలో నేను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. దేశ, విదేశాల్లోని సిక్కు సోదరసోదరీమణులను నేను ఒక్కటే అడగాలనుకుంటున్నా. నేను చేసిన వ్యాఖ్యల్లో ఏమైనా తప్పు ఉందా?’ అని రాహుల్‌ గాంధీ తన పోస్టులో అడిగారు. మరోవైపు, రాహుల్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని పలు సిక్కు సంఘాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కాగా, రాహుల్‌గాంధీపై కర్ణాటక బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బెంగళూరు హైగ్రౌండ్స్‌ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. విదేశాలలో భారత్‌ పరువును మంటగలిపేలా రాహుల్‌ గాంధీ మాట్లాడుతున్నారని, ప్రధాని మోదీ పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే అంశంపై బీజాపూర్‌, బెళగావి, బాగల్కోటెలలోనూ రాహుల్‌ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - Sep 22 , 2024 | 04:36 AM