Share News

Rahul Gandhi: మోదీ సర్కారు పతనం త్వరలో..

ABN , Publish Date - Sep 05 , 2024 | 05:34 AM

మానసికంగా ప్రధాని నరేంద్ర మోదీ పనైపోయిందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు.

Rahul Gandhi: మోదీ సర్కారు పతనం త్వరలో..

  • మానసికంగా ప్రధాని పనైపోయింది.. జమ్మూకశ్మీర్‌ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌

జమ్మూ, సెప్టెంబరు 4: మానసికంగా ప్రధాని నరేంద్ర మోదీ పనైపోయిందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. లోక్‌సభలో మోదీ ఎదురుగా కూర్చునే తాను.. ఆ విషయాన్ని స్పష్టంగా గ్రహించగలిగినట్లు చెప్పారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారని పేర్కొన్నారు. త్వరలో ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం తొలగిపోతుందని జోస్యం చెప్పారు. ఇద్దరు ధనికుల కోసం ఆర్టికల్‌ 370ని నిర్వీర్యం చేసి, జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర హోదాను లాగేసుకున్నారని విమర్శించారు. స్వతం త్ర భారత దేశంలో ఒక రాష్ట్ర హోదాను లాగేసుకోవడం ఇదే తొలిసారి అని.. గతంలో కేంద్ర పాలిత ప్రాంతాలు రాష్ట్ర హోదాను సాధించాయని గుర్తుచేశారు.


బుధవారం ఆయన జమ్మూకశ్మీర్‌లోని బనిహాల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ర్యాలీలో మాట్లాడారు. ‘‘ప్రస్తుతం మోదీ, అమిత్‌షా, వారి కార్పొరేట్‌ మిత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మోదీ హయాంలో నిరుద్యోగిత పెరిగింది. జీఎస్టీ, నోట్ల రద్దు కారణంగా చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మోదీ మిత్రులుగా చెప్పే అదానీ, అంబానీల పేర్లను నేరుగా చెప్పకూడదని నాకు ఆదేశాలున్నాయి. అందుకే నేను వారిని ఏ1, ఏ2 అని పిలుస్తాను. ఈ ప్రభుత్వం తీరు మేమిద్దరం-మాకిద్దరు(మోదీ, షా - అదానీ, అంబానీ) అన్నట్లుగా ఉంది.


ఈ నలుగురు కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు’’ అని రాహుల్‌ విమర్శించారు. భారత్‌లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే.. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. కులగణనపై మోదీ అసలు ఆ అవసరం లేదంటారని, కానీ, ఆరెస్సెస్‌ మాత్రం అది సరైందేనంటుందని ఎద్దేవా చేశారు. ‘‘ఇంతకు ముందు ఎన్నికల్లో మీరు చూసే ఉంటారు. మోదీ విశాలమైన ఛాతీతో వచ్చేవారు. ఇప్పుడు మాత్రం రాజ్యాంగాన్ని వెంటబెట్టుకుని వస్తున్నారు.


మోదీ తనకు తాను నేరుగా దేవుడితో సంబంధం ఉందని చెప్పుకొంటారు. మోదీ దేవుడితో నేరుగా మాట్లాడొచ్చేమో.. కానీ, జమ్మూకశ్మీర్‌ ఎన్నికల విషయంలో మాత్రం దేవుడు మాత్రం ప్రజల మాటే వింటాడు’’ అని రాహుల్‌ అన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కృషి చేస్తామన్నారు. కాగా.. ఈ నెల 18, 25, అక్టోబరు 1న మొత్తం మూడు దశల్లో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే..!

Updated Date - Sep 05 , 2024 | 05:34 AM