Share News

Jammu Kashmir Assembly Elections: ఎన్నికల ప్రచారానికి రాహుల్ రెడీ

ABN , Publish Date - Aug 31 , 2024 | 06:31 PM

కీలకమైన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 4వ తేదీన రెండు ఎన్నికల ర్యాలీల్లో రాహుల్ పాల్గొంటున్నారు.

Jammu Kashmir Assembly Elections: ఎన్నికల ప్రచారానికి రాహుల్ రెడీ

శ్రీనగర్: కీలకమైన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల (Jammu and Kashmir Assembly Elections) ప్రచారానికి రాహుల్ గాంధీ (Rahul Gandhi) సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 4వ తేదీన రెండు ఎన్నికల ర్యాలీల్లో రాహుల్ పాల్గొంటున్నారు. కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తుతో ఈ ఎన్నికలకు వెళ్తున్నాయి. రెండు పార్టీల అభ్యర్థుల తరఫున రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం సాగించనున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్ తెలిపారు. జమ్మూ, కశ్మీర్‌లోని ఎన్నికల ప్రచార సభల్లో సెప్టెంబర్ 4న రాహుల్ పాల్గొని, ప్రసంగిస్తారని చెప్పారు. సౌత్ కశ్మీర్ జిల్లాలోని దూరు నియోజకవర్గం నుంచి మీర్ పోటీ చేస్తున్నారు.


దూరు స్టేడియంలో జరిగే ఎన్నికల ర్యాలీతో పాటు జమ్ములోని సాంగల్దాన్‌లో జరిగే ర్యాలీలో రాహుల్ పాల్గొంటారని మీర్ చెప్పారు. రాహుల్ తమ ఆహ్వానాన్ని మన్నించి వస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. మొదట విడత ఎన్నికల్లో ఎన్నికల్లో భాగంగా రాహుల్ పర్యటన ఉంటుందని, తక్కిన రెండు ఫేజ్‌లలోనూ రాహుల్ జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తారని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రా సహా 40 మంది స్టార్ క్యాంపయినర్లు ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారని తెలిపారు.

Rahul Gandhi US visit రాహుల్ గాంధీ మూడ్రోజుల ఆమెరికా పర్యటన


జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ సెప్టెంబర్ 18న జరుగనుండగా కాంగ్రెస్ 9 మంది అభ్యర్థుల జాబితాను ఆగస్టు 27న విడుదల చేసింది. పొత్తులో భాగంగా 90 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 32 స్థానాల్లో, నేషనల్ కాన్ఫరెన్స్ 51 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. 5 స్థానాల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉంటుంది. సీపీఎం, పాంథర్స్ పార్టీ చెరో స్థానంలో పోటీ చేస్తున్నాయి. కాగా, జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ పొత్తుకు సమాజ్‌వాదీ పార్టీ మద్దతు ప్రకటించింది. తమ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని, రెండవ విడతలో కానీ, మూడో విడతలో కానీ తమ అభ్యర్థులు నామినేషన్ వేయవచ్చని ఆ పార్టీ జమ్మూకశ్మీర్ అధ్యక్షుడు జైలాల్ వర్మ తెలిపారు. సెప్టెంబర్ 25న రెండో విడత, అక్టోబర్ 1న మూడో విడత పోలింగ్ జరుగనుంది. అక్టోబర్ 4న ఫలితాలు వెలువడతాయి.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 31 , 2024 | 06:33 PM