Rahul Gandhi: వయనాడ్‌ను వదులుకున్న రాహుల్.. ఉపఎన్నికల బరిలో ప్రియాంక
ABN , Publish Date - Jun 17 , 2024 | 07:52 PM
వయనాడ్, రాయబరేలి క్‌సభ స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు నియోజకవర్గాల్లో ఒక సీటును వదులుకోవాల్సి రావడంతో తమ ఫ్యా్మిలీ నియోజకవర్గంగా భావించే రాయబరేలిని రాహుల్ ఎంచుకున్నారు. వయనాడ్ సీటును వదులుకున్నారు.
న్యూఢిల్లీ: వయనాడ్ (Wayanad), రాయబరేలి (Rae Bareli) లోక్‌సభ స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు నియోజకవర్గాల్లో ఒక సీటును వదులుకోవాల్సి రావడంతో తమ ఫ్యా్మిలీ నియోజకవర్గంగా భావించే రాయబరేలిని రాహుల్ ఎంచుకున్నారు. వయనాడ్ (Wayanad) సీటును వదులుకున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో సోమవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఈ కీల నిర్ణయం తీసుకున్నారు. వయనాడ్ నియోజకవర్గాన్ని రాహుల్ ఖాళీ చేయడంతో అక్కడ జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra)ని పోటీలోకి దింపాలని కూడా పార్టీ అగ్రనేతలు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రియాంక గాంధీ ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఇదే మొదటిసారి కానుంది. ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు.
వయనాడ్‌తో అనుబంధం..
రాహుల్ గాంధీ 2019 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతో పాటు కేరళలోని వయనాడ్‌లో పోటీ చేయగా, అమేథీలో ఓటమిని చవిచూశారు. అయితే, వయనాడ్ నుంచి ఘనవిజయం సాధించారు. రాయబరేలి నుంచి వరుసగా ఎన్నికవుతూ వస్తున్న సోనియాగాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరమవుతున్నట్టు ప్రకటించారు. అనంతరం ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో అటు వయనాడ్‌తో పాటు ఇటు రాయబరేలి నుంచి కూడా వ్యూహాత్మకంగా రాహుల్‌ను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. అందుకు తగ్గట్టే ఈ రెండు నియోజకవర్గాల్లోనూ రాహుల్ భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే, రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి రావడంతో కాంగ్రెస్ సోమవారంనాడు మరోసారి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. వయనాడ్ సీటును రాహుల్ వదులుకోవడం ద్వారా అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీని రంగంలోకి దించాలని, ప్రియాంకను తిరిగి గెలిపించడం ద్వారా రెండు సీట్లు తమకు చాలా కీలకమనే సంకేతాలు పంపాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది.
ప్రియాంక భారీ గెలుపు తథ్యం
రాయబరేలి సీటును రాహుల్ గాంధీ ఉంచుకోవాలని, వయనాడ్‌లో ప్రియాంక గాంధీని పోటీలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీ వేణుగోపాల్ తెలిపారు. పార్టీ నిర్ణయంతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. కేరళ ప్రజలకు ప్రియాంక అంటే చాలా ఇష్టమని, భారీ మెజారిటీతో ఆమె గెలుస్తారని అన్నారు.