Share News

సైబర్‌ కేటుగాళ్లు

ABN , Publish Date - Sep 09 , 2024 | 03:33 AM

రాష్ట్రంలో అత్యంత కీలక ప్రాంతానికి పోలీసు కమిషనర్‌గా ఉన్న అధికారి బంధువుకు.. సైబర్‌ నేరగాళ్లు కాల్‌ చేసి.. ఆన్‌లైన్‌ ఇన్వె్‌స్టమెంట్‌తో లక్షల్లో ఆదాయం అంటూ వలవేసి పలు దఫాలుగా రూ.16లక్షలు కాజేశారు.

సైబర్‌ కేటుగాళ్లు

  • ముంచుతున్న మోసగాళ్లు

  • సిమ్‌ బ్లాక్‌ అయిపోతుందని భయపెట్టి దోపిడీ!

  • ఒంటరి మగాళ్లకు వలపు వల.. న్యూడ్‌కాల్స్‌తో లూటీ

  • రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలు

  • రూ.లక్షలు, కోట్ల మేర.. పోగొట్టుకుంటున్న ప్రజలు

  • బాధితుల్లో ఎక్కువ మంది బాగా చదువుకున్నవారే

ఆయనో రిటైర్డ్‌ ఉద్యోగి. కొద్దిరోజుల క్రితం ఆయనకు ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. అవతలివైపు ఒక వ్యక్తి.. తాను ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నట్టు చెప్పాడు. ‘‘మీ ఆధార్‌ నంబర్‌తో అనుసంధానమై ఉన్న మూడు బ్యాంకు అకౌంట్ల నుంచి.. దావూద్‌ ఇబ్రహీం ఖాతాలకు డబ్బు బదిలీ అయింది. మీపై అరెస్ట్‌ వారంట్‌ జారీ అయింది’’ అని సీరియస్‌గా చెప్పాడు! ‘‘నేను చెప్పే దాకా మీరు ఉన్నచోటు నుంచి కదలొద్దు. ఎవరికీ ఫోన్‌ చేయొద్దు’’ అని హెచ్చరించాడు. అలా ఆ పెద్దాయన్ని భయపెట్టి, మానసికంగా హింసించి.. అసలు ఆలోచించుకోలేని పరిస్థితికి తీసుకెళ్లిపోయి పలు దఫాలుగా రూ.20 లక్షల దాకా డబ్బులు తమ ఖాతాల్లో వేయించుకున్నారు.

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో అత్యంత కీలక ప్రాంతానికి పోలీసు కమిషనర్‌గా ఉన్న అధికారి బంధువుకు.. సైబర్‌ నేరగాళ్లు కాల్‌ చేసి.. ఆన్‌లైన్‌ ఇన్వె్‌స్టమెంట్‌తో లక్షల్లో ఆదాయం అంటూ వలవేసి పలు దఫాలుగా రూ.16లక్షలు కాజేశారు. ఇదే తరహాలో మరో రిటైర్డ్‌ ఉద్యోగి వద్ద రూ.13.5 కోట్లు.. ఇంకో రిటైర్డ్‌ ఇంజనీర్‌ వద్ద రూ.5 కోట్లు దండుకున్నారు. మరో కేసులో హైదరాబాద్‌కు చెందిన మహిళా పోలీసు అధికారి దగ్గరి బంధువు ఒకరు సైబర్‌ కేటుగాళ్ళ వలకు చిక్కి రూ.5లక్షలు పోగొట్టుకున్నారు. నగరంలోనే నివసించే ఆర్మీ అధికారి, ఆయన కుటుంబసభ్యులు ఇలాంటి సైబర్‌ కేటుగాళ్ల ట్రాప్‌లో పడి రూ.50 లక్షలు పోగొట్టుకున్నారు. ట్రేడింగ్‌లో 500 శాతం లాభాలు వస్తాయంటూ రామ్‌కోటికి చెందిన ఓ వ్యాపారిని నమ్మించిన సైబర్‌ క్రిమినల్స్‌.. ఆయనతో పెట్టుబడులు పెట్టించి కొద్దిమొత్తంలో లాభాలు చూపారు.

కానీ, ఆ డబ్బు తీసుకోవాలంటే మరింత పెట్టుబడి పెట్టాలంటూ ఒత్తిడి తెచ్చారు. ఇలా అతడు రూ.2 కోట్లు పోగొట్టుకున్నాడు. మరో కేసులో.. 88 ఏళ్ల రిటైర్డ్‌ ఆర్మీ అధికారికి వలపు వల వేసి ఆయన్నుంచీ రూ.17 లక్షలు కాజేశారు కొందరు కేటుగాళ్లు. ఒంటరి పురుషులకు మహిళలతో న్యూడ్‌కాల్స్‌ చేయించి.. వారి నుంచి డబ్బులు గుంజుతున్న కేసులూ పెరుగుతున్నాయి. ..ఇలా ఒకటా రెండా.. రాష్ట్రవ్యాప్తంగా. వేలాదిగా కేసులు. ఎందరో బాధితులు.

రాష్ట్రంలో ఈ తరహా నేరాల సంఖ్య పెరుగుతుండటంతో సైబర్‌ సెల్‌ అప్రమత్తమైంది. అయితే, ఇలాంటి ఘటనల్లో స్వల్ప మొత్తంలో పోయిన డబ్బును వెంటనే రికవరీ చేస్తున్నప్పటికీ పెద్ద మొత్తంలో జరిగే మోసాల్లో రికవరీ సమస్యగా మారుతోంది. సైబర్‌ కేటుగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్న బాధితులు ఎంత త్వరగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ లావాదేవీలను నిలిపివేసి, రికవరీకి అవకాశం అంత ఎక్కువగా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.


  • కాల్‌సెంటర్లు పెట్టి మరీ..

ఢిల్లీ, గుర్గావ్‌, యూపీ, కోల్‌కతా, ముంబై తదిర నగరాల్లో సైబర్‌ నేరగాళ్లు ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌లు ఏర్పాటు చేసుకొని మరీ సైబర్‌ నేరాలకు పాల్పడున్నారు. ఒక్కో సైబర్‌ ముఠా.. దాదాపు 100 మందిదాకా టెలీకాలర్స్‌ను ఏర్పాటు చేసుకొని మార్కెట్లో లభ్యమయ్యే కస్టమర్ల సమాచారాన్ని కొనుగోలు చేసి రూ.కోట్లు లూటీ చేస్తోంది! సాంకేతిక ఆధారాలు సేకరించి అక్కడికి వెళ్లిన పోలీసులకు.. ప్రధాన నిందితులు చిక్కకుండా టెలీకాలర్స్‌, బ్యాంకు ఖాతాలు సమకూర్చేవారు, సిమ్‌కార్డులు అందించేవారు మాత్రమే దొరుకుతున్నారు. అసలు సూత్రధారులు మాత్రం.. కొన్నాళ్లపాటు మరుగున ఉండి, ఆ తర్వాత మళ్లీ బయటికొచ్చి కొత్త తరహాలో దందా మొదలుపెడుతున్నారు. దీంతో మళ్లీ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.


  • హైదరాబాద్‌లో.. రోజుకు రూ.2 కోట్లు!

ఒక్క హైదరాబాద్‌ సిటీ కమిషనరేట్‌ పరిఽధిలోనే రోజుకు రూ. 2 కోట్ల దాకా ఈ సైబర్‌ నేరగాళ్లు కేవలం ఫోన్‌ కాల్స్‌ ద్వారా కొల్లగొడుతున్నారని.. ఈ లెక్కన ఏడాదికి వారు రూ. 750-1000 కోట్లదాకా ప్రజాధనం లూటీ చేస్తున్నారని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి ఇటీవలే వెల్లడించారు. ట్రై కమిషనరేట్‌, తెలంగాణ వ్యాప్తంగా సైబర్‌ క్రిమినల్స్‌ కొల్లగొడుతున్న సొత్తును కూడా కలుపుకొంటే ఆ మొత్తం రూ. 1500 కోట్ల దాకా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో గణాంకాల ప్రకారం.. 2023 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా 8 ట్రిలియన్‌ డాలర్ల డబ్బును సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది.

2025 సంవత్సరానికి గాను ఆ మొత్తం 10.5 ట్రిలియన్‌ డాలర్స్‌కు చేరుకునే అవకాశం ఉన్నట్టు అంచనా. అంత డబ్బంటే.. అది ప్రపంచంలోనే అతిపెద్ద 3వ ఆర్థికవ్యవస్థతో సమానమని (అమెరికా జీడీపీ 28.78 ట్రిలియన్‌ డాలర్లు, చైనా జీడీపీ 18.53 ట్రిలియన్‌ డాలర్లు; ఆ రెండు దేశాల తర్వాత స్థానంలో ఉన్న జర్మనీ జీడీపీ 4.59 ట్రిలియన్‌ డాలర్లు) సైబర్‌ నిపుణులు పేర్కొన్నారు. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 175 జెటాబైట్స్‌ డేటా సైబర్‌ నేరగాళ్ల చేతికిచేరే ముప్పుందని వారు హెచ్చరిస్తున్నారు.


  • విద్యావంతులే ఎక్కువ!

సైబర్‌ నేరాల బాధితుల్లో ఎక్కువగా ఉన్నత విద్యావంతులు, సాఫ్ట్‌వేర్‌ నిపుణులే ఉంటున్నారని గత ఏడాది కాలంగా నమోదైన కేసులు స్పష్టం చేస్తున్నాయి. సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోకు ఏడాది కాలంలో మొత్తం 2,52,187 ఫిర్యాదులు అందగా.. బాధితుల్లో 60 శాతానికిపైగా ఉన్నత విద్యా వంతులు ఉన్నారు. వారిలోనూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే ఎక్కువగా ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత.. వైద్యులు, రిటైర్డ్‌ ఉద్యోగులు ఎక్కువగా ఉంటున్నారు.

Updated Date - Sep 09 , 2024 | 03:46 AM