CM Revanth : మోదీ గ్యారెంటీకి వారంటీ ఖతం
ABN , Publish Date - Jun 09 , 2024 | 04:36 AM
లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ మోదీ గ్యారెంటీతో వెళ్లిందని, కానీ ఫలితాల తీరుతో ఆ గ్యారెంటీకి వారంటీ ఖతమైందని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలో బీజేపీ ఓటమికి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత పదేళ్లలో మోదీ సర్కారు యువత, రైతులను వెన్నుపోటు పోడిచిందని విమర్శించారు.
గతంలో 3 సీట్లుంటే.. ఇప్పుడు 8 గెలిచాం
ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్
యూపీలో ఓటమికి ఆయన రాజీనామా చేయాలి
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్
బాధ్యతలు తీసుకోవాలని ప్రజల కోరిక
న్యూఢిల్లీ/హైదరాబాద్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ మోదీ గ్యారెంటీతో వెళ్లిందని, కానీ ఫలితాల తీరుతో ఆ గ్యారెంటీకి వారంటీ ఖతమైందని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలో బీజేపీ ఓటమికి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత పదేళ్లలో మోదీ సర్కారు యువత, రైతులను వెన్నుపోటు పోడిచిందని విమర్శించారు. శనివారం ఢిల్లీలోని ఆశోకాహోటల్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వారాణసీలో ప్రధాని మోదీకి మెజారిటీ తగ్గిందన్నారు.
లోక్‌సభలో మోదీ సర్కారును నిలదీసేందుకు ప్రతిపక్ష నేతగా రాహుల్ బాధ్యతలు తీసుకోవాలని దేశంలోని 140 కోట్ల ప్రజలతో పాటు కాంగ్రెస్ కోరుకుంటోందన్నారు. తెలంగాణలో కాంగ్రె్‌సకు 3 ఎంపీలుంటే ఈ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచినట్లు చెప్పారు. 64 మంది ఎమ్మెల్యేలకు తోడు కొత్తగా కంటోన్మెంట్ స్థానాన్ని గెలుచుకున్నామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 శాతం ఓట్లు తమ పార్టీకి రాగా, లోక్‌సభ ఎన్నికల్లో 41 శాతం ఓట్లు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
సోనియాతో రేవంత్ భేటీ
కాంగ్రెస్ అగ్రనేత సోనియాతో సీఎం రేవంత్ ఆమె నివాసంలో ఉదయం సమావేశమయ్యారు. సుమారు అరగంట పాటు సాగిన ఈ భేటీలో సోనియాతో పలు విషయాలు చర్చించారు. పీసీసీ అధ్యక్ష పదవి, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పనితీరు, ఫలితాలపై వివరించినట్లు తెలిసింది. తెలంగాణ తల్లి ఉత్సవాలు, అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఓటు బ్యాంకు పెరగడం, బీజేపీ గెలిచిన 8 సీట్లలో 7 చోట్ల బీఆర్‌ఎస్ డిపాజిట్లు కోల్పోవడం, బీజేపీకి బీఆర్‌ఎస్ లోపాయికారిగా సహకారం అందించిందని ఆయన ప్రస్తావించినట్లు సమాచారం. అనంతరం సోనియా నివాసం నుంచి నేరుగా సీడబ్ల్యూసీ భేటీకి వెళ్లారు. కాగా, సాయంత్రం సీఎం రేవంత్‌ను పార్టీ ఎంపీలు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘురామ్‌రెడ్డి, బలరాంనాయక్, మల్లు రవి, అనిల్‌కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
తుగ్లక్ రోడ్ 23 నివాసానికి రేవంత్..
తుగ్లక్ రోడ్‌లోని 23 నివాసానికి సీఎం రేవంత్‌రెడ్డి అధికారికంగా మారారు. సీఎం శుక్రవారం రాత్రి తుగ్లక్ రోడ్‌లోనే బస చేశారు. సీఎం రేవంత్ భార్య, కుమార్తె, అల్లుడు విడిగా శుక్రవారం ఢిల్లీ వచ్చి ఆ ఇంట్లోనే విడిది చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన రేవంత్‌కు కేంద్రం యమునా బ్లాక్‌లోని 9వ ఫ్లోర్‌లోని ప్లాట్‌ను కేటాయించగా సీఎం అయిన తర్వాత కూడా అక్కడే ఉన్నారు. అయితే తుగ్లక్ రోడ్ 23 నివాసానికి ఇటీవల చేపట్టిన చిన్నపాటి మరమ్మతులు పూర్తవడంతో సీఎం అధికారికంగా ఇక నుంచి అక్కడే బస చేయనున్నారు. కాగా, 2004 నుంచి తుగ్లక్ రోడ్‌లోని నివాసంలో కేసీఆర్ దాదాపు 20 ఏళ్లున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోవడం, సీఎం పదవి నుంచి దిగిపోవడంతో కేసీఆర్ ఆ ఇంటిని ఖాళీ చేశారు.
తీన్మార్ మల్లన్నకు సీఎం శుభాకాంక్షలు..
ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచిన తీన్మార్ మల్లన్నకు సీఎం శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆయన గెలుపు కోసం కృషి చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలను అభినందించారు.