Bandra Stampede: ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి బుల్లెట్ ట్రైన్‌తో మంత్రి బిజీ.. సంజయ్ రౌత్ ఆక్షేపణ
ABN , Publish Date - Oct 27 , 2024 | 05:31 PM
ముంబై నగరం గరిష్టంగా కేంద్రానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా సబర్బన్ ప్యాసింజర్ల పరంగా కూడా అత్యధిక స్థాయిలో ఉన్నారని, అయినప్పటికీ ప్రయాణికుల సమస్యల పరిష్కరానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని రౌత్ విమర్శించారు.
ముంబై: బాంద్రా రైల్వే స్టేషన్లో ఆదివారంనాడు జరిగిన తొక్కిసలాటలో 9 మంది ప్రయాణికులు గాయపడటం, ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Aswin Vaishnaw)ను శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ తప్పుపట్టారు. ముంబై ప్రయాణికులను నిర్లక్ష్యం చేసి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుతో కేంద్ర మంత్రి బీజీగా ఉన్నారంటూ ఆక్షేపించారు.
PM Narendra Modi: డిజిటల్ అరెస్టులపై అవగాహన అవసరం.. 'మన్ కీ బాత్'లో మోదీ
''ముంబై నగరం గరిష్టంగా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తోంది. అందుకు తగ్గట్టుగా ఇక్కడి ప్రయాణికులు మాత్రం ఎలాంటి సౌకర్యాలకు నోచుకోవడం లేదు. రైల్వే మంత్రికి ప్రయాణికుల సమస్యలు పట్టవు. దీనికితోడు మౌలిక వసతులు చాలా దయనీయంగా ఉన్నాయి. మంత్రి మాత్రం ప్రజలను వారి చావుకు వారిని వదిలేసి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుతో బీజీగా ఉన్నారు" అని సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
ముంబై నగరం గరిష్టంగా కేంద్రానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా సబర్బన్ ప్యాసింజర్ల పరంగా కూడా అత్యధిక స్థాయిలో ఉన్నారని, అయినప్పటికీ ప్రయాణికుల సమస్యల పరిష్కరానికి మంత్రి ఎలాంటి చర్యలు తీసుకోలేదని రౌత్ విమర్శించారు. మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వ హయాంలో అనేక రైతు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని అన్నారు. మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కనీసం 25 ప్రధానమైన రైలు ప్రమాదాలు జరిగాయన్నారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటని ప్రశ్నించారు. అనేక మంది ప్రజలు (బాంద్రా ఘటన) గాయపడడానికి బాధ్యులెవరు? రైల్వే మంత్రికి బాధ్యత లేదా? అని నిలదీశారు. మంత్రి తాను బాగా చదువుకున్నవాడినని, ఐఐటీ వంటి సంస్థలతో తనకు అసోసియేషన్ ఉందని చెబుతుంటారని, కానీ ప్రయాణాల కోసం రైళ్ల మీదే ఆధారపడే సామాన్య ప్రజానీకం సమస్యలు పరిష్కరించడంలో మాత్రం ఆయన విఫలవుతూనే ఉన్నారని రౌత్ విమర్శించారు.
అసమర్ధ మంత్రులు: ఆదిత్య
కాగా, బాంద్రా ఘటనపై శివసేన (యూబీటీ) నేత ఆదిత్య థాకరే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌పై విమర్శలు గుప్పించారు. రైల్వే భద్రత విషయంలో మంత్రి సామర్థ్యంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. రీల్ మినిస్టర్ కనీసం ఒకసారైన రియల్ మినిస్టర్ అనిపింటుకుంటారని ఆశిస్తునట్టు చెప్పారు. ఆయన అసమర్ధతకు తాజా ఘటన అద్దం పడుతుందని చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారకర్తల్లో ఒకరిగా అశ్విని వైష్ణవ్‌ను బీజేపీ ప్రకటించిందని, కానీ ప్రతివారం ఆయన శాఖలో ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయని అన్నారు. ''అసమర్ధులైన మంత్రులు దేశాన్ని పాలిస్తుండటం సిగ్గుచేటు'' అని ఆదిత్య విమర్శలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి...