Sharad Pawar: ఈసీ నిర్ణయంపై సుప్రీంకు శరద్ పవార్.. కేవియట్ వేసిన అజిత్ సవార్
ABN , Publish Date - Feb 13 , 2024 | 02:34 PM
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పేరు, గుర్తును అజిత్ పవార్ వర్గానికి కేటాయించడంపై ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మహారాష్ట్ర సీనియర్ నేత శరద్ పవార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈసీ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటూ ఆయన అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.
న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) పేరు, గుర్తును అజిత్ పవార్ (Ajit Pawar) వర్గానికి కేటాయించడంపై ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మహారాష్ట్ర సీనియర్ నేత శరద్ పవార్ (Sharad Pawar) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈసీ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటూ ఆయన అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఇదే సమయంలో అజిత్ పవార్ సైతం సుప్రీంకోర్టులో కేవియట్ వేశారు.
అజిత్ పవార్ వర్గానికి ఎన్‌సీపీ పేరు, గుర్తును కేటాయిస్తూ భారత ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి 6న నిర్ణయం తీసుకుంది. అజిత్ వర్గాన్నే అసలైన ఎన్‌సీపీగా గుర్తిస్తూ, పార్టీ ఎన్నికల గుర్తు 'గడియారం' వారికే కేటాయించింది. మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఈనెలలోనే ఎన్నికలు జరుగనుండటంతో పవార్ వర్గానికి 'నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్ చంద్ర పవార్' అనే పేరును కేటాయించింది. పార్టీ పేరు, గుర్తును ఆ పార్టీ వ్యవస్థాపకుడి చేతి నుంచి లాక్కొన్ని ఇతరులకు అప్పగించారంటూ ఈసీ నిర్ణయంపై శరద్ పవార్ ఆదివారంనాడు జరిగిన మీడియా సమావేశంలో అసంతృప్తి వ్యక్తంచేశారు. దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామన్నారు. 1999లో కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసుకున్న పవార్ సొంతంగా ఎన్‌సీపీని ఏర్పాటు చేశారు.