Amit shah Vs Pawar: 'రింగ్ లీడర్' వెర్సస్...వాషింగ్‌మిషన్..!
ABN , Publish Date - Jul 21 , 2024 | 07:39 PM
నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్‌పీ) చీఫ్ శరద్ పవార్ పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిని శరద్ పవార్ పార్టీ అంతే ఘాటుగా తిప్పికొట్టింది. పుణెలో మహారాష్ట్ర బీజేపీ సెషన్‌లో అమిత్‌షా ఆదివారంనాడు మాట్లాడుతూ, అవినీతి ప్రజలకు శరద్ పవార్ చీఫ్ అని, ఆయన దేశంలో అవినీతిని వ్యవస్థాగతం చేశారని విమర్శించారు.
పుణె: నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్‌పీ) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar)పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah)సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిని శరద్ పవార్ పార్టీ అంతే ఘాటుగా తిప్పికొట్టింది. పుణెలో మహారాష్ట్ర బీజేపీ సెషన్‌లో అమిత్‌షా ఆదివారంనాడు మాట్లాడుతూ, అవినీతి ప్రజలకు శరద్ పవార్ చీఫ్ అని, ఆయన దేశంలో అవినీతిని వ్యవస్థాగతం చేశారని విమర్శించారు.
''అవినీతికి అతి పెద్ద చీఫ్ శరద్ పవార్. దేశంలో అవినీతిని వ్యవస్థాగతం చేసిన వారెవరైనా ఉన్నారంటే ఆయన పవారే. ఇప్పుడు అవన్నీ చెల్లవు'' అని అమిత్‌షా పేర్కొన్నారు. పవార్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం మహారాష్ట్ర రిజర్వేషన్ అంశాన్ని వాడుకుంటున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడల్లా మరాఠా రిజర్వేషన్ల అంశం తెరపైకి వస్తుందని, శరద్ పవార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆ అంశం కనుమరుగవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేసిందన్నారు. పదేళ్లలో బీజేపీ రిజర్వేషన్లు ఎత్తేస్తుందని కాంగ్రెస్ ప్రచారం చేసిందని, కానీ ప్రధాని సారథ్యంలో రిజర్వేషన్లను పటిష్టం చేయడం ద్వారా బీజేపీ సంపూర్ణ మెజారిటీతో విజయం సాధించిందని చెప్పారు.
'వాషింగ్ మిషన్'తో క్లీన్‌చిట్..
కాగా, అమిత్‌షా వ్యాఖ్యలను ఎన్‌సీపీ-ఎస్‌పీ వెంటనే తిప్పికొట్టింది. కలంకిత నేతలను కాషాయం పార్టీలోకి తీసుకోవడం ద్వారా అవితీనితిని బీజేపీ చట్టబద్ధం చేస్తోందని విమర్శించారు. ''వాళ్లు రాజకీయ నాయకులపై అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. అదే నేతలు బీజేపీలో చేరగానే వాళ్లకి క్లీన్ చిట్ ఇచ్చేస్తుంటారు. బీజేపీ వాషింగ్ మిషన్ తీరు ఇది'' అది ఎన్‌సీపీ-ఎస్‌పీ జాతీయ ప్రతినిధి క్లాయీడ్ కాస్టే వ్యాఖ్యానించారు.