Share News

Maharashtra: సీఎంను కలిసిన శరద్ పవార్, రాజ్ థాకరే.. కారణం ఏమిటంటే..?

ABN , Publish Date - Aug 03 , 2024 | 05:57 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ద్వితీయార్థంలో జరగాల్సి ఉన్న నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్‌పీ) చీఫ్ శరద్ పవార్, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్‌థాకరేలు సీఎం ఏక్‌నాథ్ షిండేను శనివారంనాడు వేర్వేరుగా కలుసుకున్నారు.

Maharashtra: సీఎంను కలిసిన శరద్ పవార్, రాజ్ థాకరే.. కారణం ఏమిటంటే..?

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ద్వితీయార్థంలో జరగాల్సి ఉన్న నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్‌పీ) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) చీఫ్ రాజ్‌థాకరే (Raj Thackeray)లు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)ను శనివారంనాడు వేర్వేరుగా కలుసుకున్నారు.


సీఎంఓ కార్యాలయం సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన వర్ష బంగ్లాల్లో శరద్ పవార్ మహారాష్ట్ర సీఎంను కలుసుకున్నారు. పలు అంశాలతో పాటు మరాఠా రిజర్వేషన్ అంశం కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు. మరాఠా రిజర్వేషన్ అంశం రాజకీయం పరంగా కూడా చాలా బలమైన అంశంగా ఉంది. అధికార మహాయుతి కూటమితో, ముఖ్యంగా షిండేతో మాటామంతి నెరపుతున్న మహా వికాస్ అఘాడి నేత శరద్ పవార్ ఒక్కడే కావడం విశేషం. సీఎంపై విమర్శలు గుప్పించడంలో శివసే (యూబీటీ) నేత ఉద్ధవ్ థాకరే ఎన్నడూ వెనక్కి తగ్గిన దాఖలాలు లేవు.


కూటమికి రాజ్ థాకరే గుడ్‌బై..?

కాగా, మహాయుతి కూటమిని వదిలిపెట్టాలని అనుకుంటున్నట్టు ఇటీవల ప్రకటించిన రాజ్‌థాకరే అప్పట్నించి సీఎంను కలుసుకోవడం కూడా ఇదే ప్రథమం. భవనాల రీడవలప్‌మెంట్ అంశంపై షిండేతో రాజ్‌థాకరే విభేదిస్తున్నారు. రాజకీయంగా కూడా ప్రాధాన్యత కలిగిన ఈ హౌసింగ్ అంశం శనివారంనాడు జరిగిన షిండే, రాజ్‌థాకరే సమావేశంలో చర్చకు వచ్చినట్టు సీఎంఓ వర్గాలు చెబుతున్నారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర సీనియర్ ప్రభుత్వ అధికారులు కూడా కొందరు పాల్గొన్నట్టు చెబుతున్నారు.


మహాయుతి కూటమి ప్రణాళికలకు నిధులు ఎక్కడవని రాజ్‌థాకరే ఇటీవల నిలదీశారు. రోడ్లపై గుంతలు పూడ్చడానికే ప్రభుత్వం వద్ద నిధులు లేనప్పుడు 'లాడ్లీ బహెన్', 'లాడ్లా భాయ్'కి నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా 200 నుంచి 250 సీట్లలో తాము పోటీ చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఎంఎన్ఎస్ నుంచి కొందరు పార్టీ ఫిరాయించవచ్చనే ఊహాగానాలపై అడిగినప్పుడు, తానూ విన్నానని, పార్టీ ఫిరాయింపుదారులకు తాను రెడ్ కార్పెడ్ పరుస్తానని, తక్షణం వారు వెళ్లిపోవచ్చని రాజ్‌థాకరే సమాధానమిచ్చారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ ఒకే సీటు గెలుచుకోగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎంఎన్ఎస్ మద్దతు ప్రకటించింది.

Updated Date - Aug 03 , 2024 | 05:57 PM