INDIA Bloc: ఎన్ని సీట్లని అడిగితే రాహుల్ సరదా సమాధానం
ABN , Publish Date - Jun 02 , 2024 | 02:54 PM
'ఇండియా' కూటమి ఎన్ని సీట్లు గెలుచుకుంటుందని అడిగినప్పుడు ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ తమాషా సమాధానమిచ్చారు. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా ''295 ట్రాక్''ను ప్రస్తావించారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ముగిసి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఎన్డీయే మ్యాజిక్ ఫిగర్‌ను దాటుతుందని చెప్పనప్పటికీ, గెలుపు తమదేనని, తమది ''పీపుల్స్ సర్వే'' అని కాంగ్రెస్ చెబుతోంది. ఈ క్రమంలో 'ఇండియా' కూటమి ఎన్ని సీట్లు గెలుచుకుంటుందని అడిగినప్పుడు ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తమాషా సమాధానమిచ్చారు. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా ''295 ట్రాక్''ను ప్రస్తావించారు. ''సిద్ధూ మూసేవాలా సాంగ్ విన్నారా?'' అని ప్రశ్నిస్తూ, 295 సీట్లు...అని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్‌పై మాట్లాడుతూ, అవి ఎగ్జిట్ పోల్స్ కావని, మోదీ మీడియా పోల్ అని, ఆయన ఫాంటసీ ఫోల్ అని అభివర్ణించారు.
EC: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలు
'ఎగ్జిట్ పోల్స్' ఓ సైకలాజికల్ గేమ్
దీనికి ముందు, ఎగ్జిట్ పోల్స్ ప్రొజక్షన్‌పై కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి జైరామ్ రమేష్ నిశిత విమర్శలు చేశారు. ఇదొక సైకలాజికల్ గేమ్ అని కొట్టిపారేశారు. జూన్ 4న మోదీకి ఉద్వాసన ఖాయమని, ఎగ్జిట్ పోల్స్‌తో మ్యానేజ్ చేయాలని ఆయన చూస్తున్నారని అన్నారు. ఎగ్జిట్ పోల్స్‌కు, జూన్ 4న వెలువడే ఫలితాలకు చాలా తేడా ఉంటుందని చెప్పారు. శనివారంనాడు జరిపిన ఇండియా కూటమి సమావేశంలో గెలిచే స్థానాలపై సమగ్రంగా చర్చించామని, 'ఇండియా' కూటమికి ఎట్టి పరిస్థితుల్లోనూ 295 కంటే తక్కువ సీట్లు రావని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, జూన్ 4న కౌంటింగ్ నేపథ్యంలో న్యూఢిల్లీ నిర్వాణ్ సదన్‌లో ఎన్నికల కమిషన్‌ను ఆదివారం మధ్యాహ్నం 4.30 గంటలకు 'ఇండియా' కూటమి ప్రతినిధి బృందం కలుసుకోనుంది.
For Latest News and National News click here..