Share News

NEET: పరీక్ష కేంద్రాల వారీగా నీట్‌ ఫలితాలు..

ABN , Publish Date - Jul 19 , 2024 | 04:50 AM

నీట్‌ పేపర్‌ లీకేజీపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు గురువారం జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్‌టీఏ)కు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష కేంద్రాలు, నగరాల వారీగా ఫలితాలను ప్రకటించాలని స్పష్టం చేసింది.

NEET: పరీక్ష కేంద్రాల వారీగా నీట్‌ ఫలితాలు..

  • నగరాల వారీగానూ.. రేపు మధ్యాహ్నం 12లోపు ప్రకటించాలి

  • ఎన్‌టీఏను ఆదేశించిన సుప్రీంకోర్టు.. 22న మరోమారు విచారణ

న్యూఢిల్లీ, జూలై 18: నీట్‌ పేపర్‌ లీకేజీపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు గురువారం జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్‌టీఏ)కు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష కేంద్రాలు, నగరాల వారీగా ఫలితాలను ప్రకటించాలని స్పష్టం చేసింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోపు ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టాలని సూచించింది. విద్యార్థుల గుర్తింపును బహిర్గతం చేయొద్దని పేర్కొంది. నీట్‌-యూజీ పరీక్షలు మే 5న దేశవ్యాప్తంగా జరగ్గా.. పట్నా, హజారీబాగ్‌లలో పేపర్‌ లీకేజీ కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లోని గోద్రా, మరికొన్ని ప్రాంతాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో.. సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే..! దీంతో మే 5న జరిగిన నీట్‌ పరీక్షను రద్దు చేయాలని, తిరిగి పరీక్షను నిర్వహించాలని కోరుతూ పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


ఎన్‌టీఏ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కలుపుకొని.. మొత్తం 40 పిటిషన్లను కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్ధివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాల ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఈ నెల 11న జరిగిన విచారణలో సీబీఐ, ఎన్టీఏ వాదనలను నమోదు చేసుకుంది. గురువారం మరోమారు విచారణ చేపట్టింది. శనివారం ఫలితాలను నగరాలు, పరీక్ష కేంద్రాల వారీగా విడుదల చేయాలని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఈ సందర్భంగా ఎన్టీఏను ఆదేశించారు. ఈ నెల 22న మరోమారు విచారణ చేపడతామని సూచించారు. పేపర్‌ లీకేజీ దేశంలోని అన్ని ప్రాంతాల్లో జరగలేదని అభిప్రాయపడ్డ ధర్మాసనం.. కేవలం పట్నా, హజారీబాగ్‌కే పరిమితమైనట్లు వెల్లడించింది. గుజరాత్‌, ఇతర ప్రాంతాల్లో పేపర్‌ లీక్‌ అవ్వలేదని చెప్పలేమని పేర్కొంది.


గోద్రాలో కేవలం అభ్యర్థుల తరఫున ఇతరులు ఓఎంఆర్‌ షీట్లను నింపినట్లు తేలిందని వివరించింది. పిటిషనర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘పేపర్‌ లీకేజీ అనేది దేశవ్యాప్తంగా జరగలేదు. అలా జరిగిందనడానికి వేర్వేరు నగరాల్లో కాంటాక్ట్‌లను గుర్తించలేదు. లక్షల మంది విద్యార్థులు ఈ కేసు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. పరీక్ష పవిత్రత విస్తృత స్థాయిలో దెబ్బతిన్నదని గుర్తిస్తేనే మరోమారు పరీక్ష నిర్వహణకు ఆదేశాలు జారీ చేయగలం. దీనిపై సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. సీబీఐ ఇప్పటి వరకు మాకు చెప్పిన దర్యాప్తు వివరాలను మేం బహిర్గతం చేశాం’’ అని వ్యాఖ్యానించింది. ప్రశ్నపత్రం లీకేజీ కొన్ని కేంద్రాలకే పరిమితమైందా? లేదా దేశవ్యాప్తంగా వ్యాపించిందా? అనే విషయాలు తెలియాలంటే.. పరీక్ష కేంద్రాల వారీగా ఫలితాల విడుద ల కీలకమని అభిప్రాయపడింది.


సీబీఐ అదుపులో ఎయిమ్స్‌ విద్యార్థులు

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ గురువారం పట్నాలోని ఎయిమ్స్‌లో చదువుతున్న నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకుంది. వీరిలో ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతున్న చందన్‌సింగ్‌, రాహుల్‌ అనంత్‌, కుమార్‌ షాను, రెండో సంవత్సరం విద్యార్థి కరణ్‌ జైన్‌ ఉన్నా రు. ‘‘సీబీఐ అధికారులు హాస్టల్‌ గదుల్లోనే విద్యార్థులను విచారించారు. ఆ తర్వాత ఆ గదులకు సీల్‌ వేసి, విద్యార్థులను తమ వెంట తీసుకెళ్లారు’’ అని పట్నా ఎయిమ్స్‌ డైరెక్టర్‌ జీకే పాల్‌ తెలిపారు. అయి తే.. ఈ కేసులో సీబీఐ ఇటీవల అరెస్టు చేసిన పంకజ్‌ కుమార్‌ అలియాస్‌ ఆదిత్య అనే ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌తో ఈ నలుగురు విద్యార్థులకు సంబంధాలు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jul 19 , 2024 | 04:50 AM