Share News

Supreme Court : బుల్డోజర్‌ న్యాయం సరికాదు

ABN , Publish Date - Sep 03 , 2024 | 03:35 AM

క్రిమినల్‌ కేసుల్లో నిందితులైనంత మాత్రాన వారి ఇళ్లను ఎలా కూల్చివేస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే.

Supreme Court : బుల్డోజర్‌ న్యాయం సరికాదు

  • నిందితుడైతే.. ఇంటిని కూల్చేస్తారా?.. దోషిగా తేలినా అలా చేయకూడదు

  • నిబంధనల ప్రకారమే నడుచుకోవాలి

  • దీనిపై మార్గదర్శకాలు రూపొందిస్తాం

  • సమస్య దేశవ్యాప్తం.. పరిష్కారం చూపుతాం

  • కూల్చివేతలను అడ్డుకోవాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

  • తదుపరి విచారణ 17కు వాయిదా

న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: క్రిమినల్‌ కేసుల్లో నిందితులైనంత మాత్రాన వారి ఇళ్లను ఎలా కూల్చివేస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. అక్రమ కట్టడాలన్న ఆరోపణలతో వాటిని కూల్చేస్తున్నారు. ఈ కూల్చివేతలు వివాదాస్పదంగా మారుతున్నాయి. బుల్డోజర్‌ న్యాయం పేరిట జరుగుతున్న ఈ కూల్చివేతలను అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం నిందితులన్న కారణంతో వారి ఇంటిని ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. ఒకవేళ దోషిగా నిర్ధారణ అయినా.. చట్టంలోని నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

అదేసమయంలో అక్రమ నిర్మాణాలు లేదా రహదారులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తాము రక్షించబోమని తేల్చిచెప్పింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పందిస్తూ.. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే అఫిడవిట్‌ దాఖలు చేసినట్లు చెప్పారు. కేవలం నిందితులైనంత మాత్రాన వారి ఇళ్లను కూల్చివేయడం లేదని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలిన వారి ఇళ్లను.. అదికూడా స్థానిక సంస్థలు లేదా స్థానిక అభివృద్ది సంస్థల నిబంధనల ప్రకారమే కూల్చివేస్తున్నట్లు స్పష్టం చేశారు. స్పందించిన ధర్మాసనం.. ఈ అంశంపై దేశమంతటా వర్తించేలా మార్గదర్శకాలను రూపొందిస్తామని తెలిపింది.


కూల్చివేతల విషయంపై రాష్ట్రాలతో చర్చించి పరిష్కార మార్గాలను కనుగొంటామని మెహతా చెప్పారు. కొందరు నేరాలు చేసినంత మాత్రానే, వారి ఇళ్లను కూల్చేస్తున్నట్లుగా పిటిషనర్లు పేర్కొంటున్నారని.. అది సరికాదని తెలిపారు. కూల్చివేతల కంటే చాలా ముందే అధికారులు నోటీసులు జారీ చేశారని.. కావాలంటే ధర్మాసననానికి వాటిని చూపుతానని మెహతా అన్నారు. ఈ వివాదానికి గతంలో తాము సమర్పించిన అఫిడవిట్‌తోనే ముగింపు పలకవచ్చని తెలిపారు. స్పందించిన ధర్మాసనం.. వ్యక్తులు లేదా అధికారులు ఎవరూ చట్టాల్లోని లొసుగులను అవకాశంగా చేసుకోరాదని పేర్కొంది. ఈ కూల్చివేతల అంశంపై దేశవ్యాప్తంగా అమలు చేసేలా మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. అలాంటి మార్గదర్శకాలు రూపొందించాల్సిందేనని పిటిషనర్ల తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే చెప్పారు. కాగా, ఈ విషయమై సలహాలు, సూచనలు అందజేయాలని ధర్మాసనం ఇరుపక్షాలను ఆదేశించింది. వాటిని పరిశీలించిన తర్వాత తాము మార్గదర్శకాలను రూపొందిస్తామని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.

  • కులగణనపై పిటిషన్‌ నిరాకరణ

కులాల వారీ జనాభా లెక్కలు సేకరించేలా కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని స్వీకరించేందుకు సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపర నిర్ణయమని, తామేమీ చేయలేమని తెలిపింది. న్యాయవాది శ్రావణ్‌ కుమార్‌ కరణం ద్వారా పి.ప్రసాద్‌ నాయుడు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated Date - Sep 03 , 2024 | 03:38 AM