Share News

Delhi Water Crisis: ఆప్ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించిన సుప్రీంకోర్టు

ABN , Publish Date - Jun 12 , 2024 | 03:58 PM

న్యూఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మహానగరంలో నీటి కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు ఏమిటని ఆప్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

Delhi Water Crisis: ఆప్ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, జూన్ 12: న్యూఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మహానగరంలో నీటి కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు ఏమిటని ఆప్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో మంచి నీటి కొరత నేపథ్యంలో ఆప్ ప్రభుత్వానికి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ప్రసన్న బి వార్లేతో కూడిన ధర్మాసనం పలు ప్రశ్నలను సంధించింది. ట్యాంకర్ మాఫియా నియంత్రణతోపాటు మంచి నీటి వృధాను ఆరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటని ప్రశ్నించింది.


ట్యాంకర్ మాఫియాను నియంత్రించ లేక పోతున్నారంటూ ఆప్ ప్రభుత్వంపై ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మాఫియాపై అరికట్టేందుకు జోక్యం చేసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించమంటారా? అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం సూటిగా ఆప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. టాంకర్ మాఫియాపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? వారిపై ఒక్క ఎఫ్ఐఆర్ అయినా నమోదు చేశారా? అని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. మంచి నీరు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని.. ఈ విషయాన్ని అన్ని మీడియా చానెల్స్‌లో ప్రసారమవుతుందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. వేసవిలో నీరు లేక పోవడంతో.. మంచి నీటి వృధాను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటని ప్రభుత్వాన్ని ధర్మాసనం నిలదీసింది. ఈ అంశంపై గురువారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.


మరోవైపు న్యూఢిల్లీకి మంచి నీటి సరఫరా చేయాలని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వికె సక్సేనా.. మంగళవారం హర్యానా సీఎం సైనీకి ఫోన్ చేసి కోరారు. అంతుకుముందు రోజు ఇదే అంశంపై ఆప్ మంత్రులు అతిశీ, సౌరభ్ భరద్వాజ్.. ఎల్జీ సక్సేనాను కలిశారు. ఈ నేపథ్యంలో హర్యానా సీఎంకు ఢిల్లీ ఎల్జీ ఫోన్ చేశారు. ఆ క్రమంలో న్యూఢిల్లీకి మంచి నీటిని సరఫరా చేసేందుకు సీఎం సైనీ సుముఖత వ్యక్తం చేశారని ఎల్జీ స్పష్టం చేశారు. ఇంకోవైపు ఎన్నికల వేళ.. బీజేపీ ప్రభుత్వం కుట్రకు తెర తీసిందని ఆరోపించింది. ఇంకోవైపు హిమాచల్‌ప్రదేశ్ అందించే మిగులు జలాలను.. న్యూఢిల్లీకి సరఫరా చేసేలా హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో ఢిల్లీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - Jun 12 , 2024 | 05:43 PM