Share News

Supreme Court: పారిశ్రామిక ఆల్కహాల్‌పై రాష్ట్రాలదే అధికారం..

ABN , Publish Date - Oct 24 , 2024 | 04:36 AM

పారిశ్రామిక ఆల్కహాల్‌ తయారీ, సరఫరాలపై నియంత్రణ అధికారం రాష్ట్రాలదేనని (శాసన సభలదేనని) సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

Supreme Court: పారిశ్రామిక ఆల్కహాల్‌పై రాష్ట్రాలదే అధికారం..

  • తయారీ, సరఫరా తదితర అన్ని ప్రక్రియలపైనా చట్టాలు చేయొచ్చు

  • దీనిని కేంద్రం అడ్డుకోలేదు

  • రాజ్యాంగంలోని ఎంట్రీ 8 స్పష్టతనిస్తోంది

  • 1990 నాటి తీర్పును తిరగరాస్తూ సుప్రీంకోర్టు 8:1 మెజారిటీ తీర్పు

  • ఆ అధికారం కేంద్రానిదేనంటూ జస్టిస్‌ నాగరత్న విడిగా తీర్పు

న్యూఢిల్లీ, అక్టోబరు 23: పారిశ్రామిక ఆల్కహాల్‌ తయారీ, సరఫరాలపై నియంత్రణ అధికారం రాష్ట్రాలదేనని (శాసన సభలదేనని) సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఔషధాలు, టెక్స్‌టైల్స్‌, డైలు, యాంటీఫ్రీజ్‌ సమ్మేళనాలు, ఇంక్‌లు, సాల్వెంట్లు, క్లీనర్లు, సౌందర్య సాధనాలు తదితర ఉత్పత్తుల తయారీలో ఉపయోగించే పారిశ్రామిక ఆల్కహాల్‌పై ఇప్పటి వరకూ కేంద్రప్రభుత్వానికే నియంత్రణ ఉంటూ వస్తోంది. 1990లో సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం పారిశ్రామిక ఆల్కహాల్‌ (రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ అని కూడా అంటారు) ఉత్పత్తి, సరఫరా తదితర ప్రక్రియలపై కేంద్రానికే అధికారం ఉంటుందని తీర్పు ఇచ్చింది.


దీనిని యూపీతోపాటు పలు రాష్ట్రాలు సవాల్‌ చేస్తూ పిటిషన్లు దాఖలు చేశాయి. 2010లో ఈ కేసును తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనానికి సిఫార్సు చేశారు. నాటి నుంచి విచారణ కొనసాగింది. బుధవారం సుప్రీంకోర్టు 8:1 మెజారిటీ తీర్పును వెలువరించింది. ధర్మాసనానికి నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ చంద్రచూడ్‌తో పాటు జస్టి్‌సలు రిషికేశ్‌ రాయ్‌, అభయ్‌ ఒకా, జేబీ పార్ధివాలా, మనోజ్‌ మిశ్రా, ఉజ్జల్‌ భుయాన్‌, సతీశ్‌చంద్ర శర్మ, అగస్టీన్‌ జార్జ్‌ మాసి 364 పేజీల మెజారిటీ తీర్పును ఇచ్చారు. దీనితో జస్టిస్‌ నాగరత్న విబేధిస్తూ.. పారిశ్రామిక ఆల్కహాల్‌పై చట్టాలు చేసే అధికారం రాష్ట్రాల శాసనసభలకు అధికారం ఉండదని, ఆ అధికారం పార్లమెంటుదేనని విడిగా తీర్పును ప్రకటించారు.


  • ఇది కూడా ‘మత్తు ద్రావకాల’ పరిధిలోకే!

రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో రాష్ట్రాల జాబితాలో ఉన్న ఎంట్రీ 8లోని ‘మత్తు కలిగించే ద్రావకాలు’ అనే పదం పరిధిలోకి పారిశ్రామిక ఆల్కహాల్‌ కూడా వస్తుందని సీజేఐ వెలువరించిన మెజారిటీ తీర్పులో స్పష్టం చేశారు. ‘మత్తు కలిగించే ద్రావకాల’ తయారీ, నిల్వ, రవాణా, కొనుగోళ్లు, అమ్మకాలపై చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలదేనని ఎంట్రీ 8 నిర్వచిస్తున్న విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. అయితే, రాజ్యాంగంలోని కేంద్రప్రభుత్వ జాబితాలో ఉన్న ఎంట్రీ 52, ఉమ్మడి జాబితాలోని ఎంట్రీ 33.. ఏయే పరిశ్రమలపై కేంద్రానికి అధికారం కట్టబెడుతూ పార్లమెంటు చట్టం చేస్తుందో ఆ పరిశ్రమలపై కేంద్రానికే సర్వాధికారాలు ఉంటాయని చెబుతోంది.


ఎంట్రీ 52 ఆధారంగానే 1990లో పారిశ్రామిక ఆల్కహాల్‌పై కేంద్రానికే అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. తాజాగా దీనిని తిరగరాస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎంట్రీ 52 కింద కేవలం ఒక డిక్లరేషన్‌ జారీ చేసి యావత్‌ పరిశ్రమను కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చేలా పార్లమెంటు చట్టం చేయలేదని ధర్మాసనం పేర్కొంది. జస్టిస్‌ నాగరత్న విడిగా 238 పేజీల తీర్పునిచ్చారు. ఫర్మెంటేషన్‌ (పులియబెట్టే ప్రక్రియలకు సంబంధించిన) పరిశ్రమలన్నింటిపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకే ఉందని, రాష్ట్రాల శాసనసభలకు ఆ అధికారం లేదని జస్టిస్‌ నాగరత్న పేర్కొన్నారు.

Updated Date - Oct 24 , 2024 | 04:36 AM