Share News

Tamilisai: బీజేపీ సభ్యత్వం తీసుకున్న తమిళిసై సౌందరరాజన్‌..

ABN , Publish Date - Mar 22 , 2024 | 01:11 PM

గవర్నర్‌ పదవికి రాజీనామా చేసి మళ్లీ బీజేపీకి సేవలందించాలనే కష్టమైన నిర్ణయాన్ని ఇష్టపడే తీసుకున్నానని తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల మాజీ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌(Dr. Tamilisai Soundararajan) వ్యాఖ్యానించారు.

Tamilisai: బీజేపీ సభ్యత్వం తీసుకున్న తమిళిసై సౌందరరాజన్‌..

చెన్నై: గవర్నర్‌ పదవికి రాజీనామా చేసి మళ్లీ బీజేపీకి సేవలందించాలనే కష్టమైన నిర్ణయాన్ని ఇష్టపడే తీసుకున్నానని తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల మాజీ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌(Dr. Tamilisai Soundararajan) వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం ఆమె బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. టి.నగర్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయం కమలాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, ఎల్‌ మురుగన్‌ సమక్షంలో ఆమె పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ... బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలిగా గతంలో పార్టీకి, గవర్నర్‌గా రెండు రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన తాను మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం తాను సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరానని, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానన్నారు. రాజ్‌భవన్‌ను విడిచి ప్రజా భవన్‌గా ఉన్న పార్టీ కార్యాలయానికి వచ్చానని, లోక్‌సభ సభ్యురాలిగా తమిళ ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతోనే గవర్నర్‌ పదవికి రాజీనామా చేశానన్నారు. ఏడేళ్ల క్రితం పార్టీ మహానాడుకు మోదీ విచ్చేసినప్పుడు ‘మళ్లీ మోదీ.. రావాలి మోదీ’ అంటూ తాను చేసిన నినాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుండటం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. ప్రస్తుతం తమిళనాట బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని, తామర తప్పకుండా వికసిస్తుందని తమిళిసై వ్యాఖ్యానించారు.

nani7.jpg

Updated Date - Mar 22 , 2024 | 01:11 PM