Share News

Lavu Krishna Devarayalu: ఎన్డీయే నేతల సమావేశంలో ఈ అంశాలపై కీలక చర్చ

ABN , Publish Date - Dec 25 , 2024 | 03:36 PM

Lavu Krishna Devarayalu:మరికొద్ది రోజుల్లో ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. అలాగే ఇటీవల ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అలాంటి వేళ.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు నేతలు బుధవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

Lavu Krishna Devarayalu: ఎన్డీయే నేతల సమావేశంలో ఈ అంశాలపై కీలక చర్చ
TDP MP Lavu Krishna Devaraylu

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఎన్డీయే నేతల సమావేశంలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌తోపాటు వక్ఫ్ బోర్డ్‌పై చర్చ జరగలేదని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఈ సమావేశం చక్కగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశం అనంతరం బుధవారం న్యూఢిల్లీలో లావు శ్రీకృష్ణదేవరాయులు విలేకర్లతో మాట్లాడుతూ.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు పలు సూచనలు, సలహాలపై ఈ సమావేశంలో చర్చించామన్నారు.

ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాలతోపాటు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరిగిన చర్చ పై ఈ భేటీలో చర్చించినట్లు ఆయన వివరించారు. అలాగే భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి నేతలు ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనే అంశంపై చర్చించామన్నారు. అదే విధంగా ఎంపీల నియోజకవర్గంలో అభివృద్ధి అంశాలపై సైతం చర్చ జరిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనే అంశాలపై సైతం చర్చించామన్నారు. లోక్‌‌సభ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయో కూడా చర్చించామని వివరించారు.


బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే నేతల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అమిత్ షా, జేపీ నడ్డా, టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం నారా చంద్రబాబు నాయుడు, కుమారస్వామి, జితిన్ రామ్ మాంఝీ, లలన్ సింగ్, భుపేంద్ర యాదవ్, రామ్మోహన్ నాయుడు, ప్రతాప్ రావ్ జాదవ్, అనుప్రియా పాటిల్, అరుణ్ సింగ్, రంగ్ గోరా, తుషార్ వెల్లపల్లి, వినయ్ కోరే, సంజయ్ నిషాద్, జాన్ పాండియన్, ఉపేంద్ర కుష్వా తదితర నేతలు హాజరయ్యారు.

Also Read: దాని వెనుకనున్న మతలబేంటో సీఎం బయటపెట్టాలి


మరికోద్ది మాసాల్లో ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్డీయే కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులోభాగంగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు సమావేశమయ్యారు. మోదీ సారథ్యంలో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయింది. అనంతరం మూడోసారి ఎన్డీఏ నేతలు ఈ రోజు న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. అదే విధంగా మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారిగా.. నేతలు సమావేశమయ్యారు.


ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో పలు విడతలుగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలను గెలుచుకొంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీ (ఎస్), జేడీ (యూ), లోక్ జన శక్తి (రామ్ విలాస్ పాశ్వాన్) తదితర పార్టీల మద్దతు తీసుకుంది. దీంతో మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, హర్యానాలలో బీజేపీ, ఆ పార్టీ భాగస్వామ్య పక్షాలు విజయం సాధించిన విషయం విధితమే.

For National News And Telugu News

Updated Date - Dec 25 , 2024 | 03:40 PM