jammu kashmir: యాత్రికుల బస్సుపై ఉగ్ర దాడి..
ABN , Publish Date - Jun 10 , 2024 | 05:13 AM
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. యాత్రికులతో వెళ్తున్న బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. రియాసీ జిల్లాలోని శివ్ ఖోడీ ఆలయాన్ని సందర్శించుకున్న యాత్రికులు కాట్రాకు వెళ్తుండగా ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో పోని ప్రాంతంలోని తెర్యాత్ గామ్రం వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
10 మంది మృతి.. 33 మందికి గాయాలు..!
టెర్రరిస్టుల కాల్పులతో అదుపు కోల్పోయిన డ్రైవర్
అనంతరం లోయలోకి పడిపోయిన వాహనం
జమ్ము కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో ఘటన
పరిస్థితిని సమీక్షించిన ప్రధాని మోదీ
బాఽధ్యులను వదిలేది లేదు: అమిత్ షా
8 కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో ఘటన
8 పరిస్థితిని సమీక్షించిన ప్రధాని మోదీ
జమ్మూ, జూన్ 9: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. యాత్రికులతో వెళ్తున్న బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. రియాసీ జిల్లాలోని శివ్ ఖోడీ ఆలయాన్ని సందర్శించుకున్న యాత్రికులు కాట్రాకు వెళ్తుండగా ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో పోని ప్రాంతంలోని తెర్యాత్ గామ్రం వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఫలితంగా బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పదిమంది యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 33 మంది గాయపడ్డారు. బాధితులందరూ ఇతర ప్రాంతాలకు చెందినవారేనని పోలీసులు వెల్లడించారు. కాగా, ఎత్తైన ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదులు కాల్పులు జరపడం.. బస్సు లోయలోకి దొర్లుకుంటూ పడిపోవడం క్షణాల్లోనే జరిగిపోయాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే చేరుకుని స్థానికులతో కలిసి సహాయ చర్యలు చేపట్టారు.
రాత్రి 8 గంటల సమయానికి గాయపడ్డ యాత్రికులందర్నీ బయటకు తీసుకొచ్చారు. రియాసీ, తెర్యాత్, జమ్మూలోని ఆస్పత్రులకు తరలించారు. పోలీసులు, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ రంగంలో దిగి ఉగ్రవాదుల కోసం వేట మొదలు పెట్టాయి. కశ్మీర్‌లోని రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లో ఉగ్రవాదం తీవ్రంగా ఉంటుంది. రియాసీలో ఆ ప్రభావం కనిపించదు. అలాంటిచోట దాడి జరగడంతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. కాగా, ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ పరిస్థితిని సమీక్షించారు.దాడికి బాధ్యులైనవారిని విడిచిపెట్టేది లేదని కేంద్ర మంత్రి అమిత్ షా హెచ్చరించారు. ప్రధాని మోదీ, మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో, పలు దేశాల అధిపతులు వచ్చిన సందర్భంలో ఈ దాడి జరగడం దారుణమని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యానించారు. కశ్మీర్‌లో శాంతిభద్రతలు ఆందోళనకర రీతిలో ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.