Share News

UP: యూపీలో సమాజ్‌వాదీకి పరీక్ష! రేపు 10 లోక్‌సభ స్థానాలకు ఎన్నిక..

ABN , Publish Date - May 06 , 2024 | 04:52 AM

సార్వత్రిక ఎన్నికల మూడోదశలో ఉత్తరప్రదేశ్‌లోని కీలకమైన 10 లోక్‌సభ నియోజకవర్గాలకు మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి. అవి సంభల్‌, హత్రాస్‌, ఆగ్రా, ఫతేపూర్‌ సిక్రీ, ఫిరోజాబాద్‌, మెయిన్‌పురి, ఎటా, బదాయూ, బరేలీ, ఆవ్‌లా నియోజకవర్గాలు.

UP: యూపీలో సమాజ్‌వాదీకి పరీక్ష! రేపు 10 లోక్‌సభ స్థానాలకు ఎన్నిక..

సార్వత్రిక ఎన్నికల మూడోదశలో ఉత్తరప్రదేశ్‌లోని కీలకమైన 10 లోక్‌సభ నియోజకవర్గాలకు మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి. అవి సంభల్‌, హత్రాస్‌, ఆగ్రా, ఫతేపూర్‌ సిక్రీ, ఫిరోజాబాద్‌, మెయిన్‌పురి, ఎటా, బదాయూ, బరేలీ, ఆవ్‌లా నియోజకవర్గాలు. వీటిలో ఎనిమిది స్థానాలను గత ఎన్నికల్లో బీజేపీ గెలుపొందగా, సంభల్‌, మెయిన్‌పురిల్లో మాత్రమే సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) విజయం సాధించింది. పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ కుటుంబానికి చెందిన ముగ్గురు కీలకమైన వ్యక్తులు మూడో దశ బరిలో ఉన్నారు. దీంతో ఈ ఎన్నికలు సమాజ్‌వాదీ పార్టీకి పరీక్షగా భావిస్తున్నారు. అఖిలేశ్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ మెయిన్‌పురిలో, అఖిలేశ్‌ బాబాయి శివపాల్‌ యాదవ్‌ కుమారుడు ఆదిత్య యాదవ్‌ బదాయూలో, వీరి కుటుంబానికే చెందిన అక్షయ్‌ యాదవ్‌ ఫిరోజాబాద్‌లో పోటీ చేస్తున్నారు.


వెనుకబడిన తరగతులకు చెందిన యాదవ, లోధ్‌, కచ్ఛీ/శక్య/మురావ్‌ కులాల ఓట్లు మూడో దశలో కీలక ప్రభావం చూపనుండగా కొన్ని ప్రాంతాల్లో ముస్లింలు, జాట్‌ల ఓట్లు కూడా గణనీయమైన ప్రభావం చూపనున్నాయి. బీజేపీ తరఫున మోదీ, అమిత్‌షా, యోగి ఆదిత్యనాథ్‌ తదితర కీలక నేతలు ఇక్కడ ముమ్మరంగా ప్రచారం చేశారు. ఎస్పీ, కాంగ్రెస్‌ పార్టీల కుటుంబ పాలన, అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని ఆ పార్టీల నేతలు తిరస్కరించడం తదితర అంశాలను బీజేపీ ప్రచారాస్ర్తాలుగా చేసుకుంది.

దీనికి దీటుగా.. బీజేపీ మరోసారి గెలిస్తే రిజర్వేషన్లను తొలగిస్తుందంటూ సమాజ్‌వాదీపార్టీ ప్రచారం చేసింది. హత్రాస్‌, ఫిరోజాబాద్‌, ఎటా, బదాయూ నియోజకవర్గాల్లో బీజేపీ, ఎస్పీ మధ్య హోరాహోరీగా ద్విముఖ పోరు ఉంటుందని, మిగిలిన స్థానాల్లో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి కూడా ఓటుబ్యాంకు గణనీయంగా ఉండటంతో వాటిలో ఎన్డీయే, ఇండియా కూటమి, బీఎస్పీ మధ్య త్రిముఖ పోరు ఉంటుందని భావిస్తున్నారు.

Updated Date - May 06 , 2024 | 04:52 AM