National : మోదీవి విద్వేష ప్రసంగాలు
ABN , Publish Date - May 31 , 2024 | 04:03 AM
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ అత్యంత దుర్మార్గమైన రీతిలో విద్వేష ప్రసంగాలు చేశారని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ తీవ్రవ్యాఖ్యలు చేశారు.
ప్రధాని పదవి గౌరవాన్ని తగ్గించారు
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఆగ్రహం
న్యూఢిల్లీ, మే 30(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ అత్యంత దుర్మార్గమైన రీతిలో విద్వేష ప్రసంగాలు చేశారని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. మోదీది పూర్తిగా విభజన మనస్తత్వమని మండిపడ్డారు. ప్రధాని పదవి గౌరవాన్ని తగ్గించిన తొలి ప్రధాని మోదీయే అన్నారు. పంజాబ్‌లోని 13 పార్లమెంటు స్థానాలకు జూన్ 1న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు గురువారం ఆయన బహిరంగ లేఖ రాశారు.
గతంలో ఏ ప్రధాని కూడా మోదీ మాదిరిగా దుందుడుకుతనంతో ఒక సామాజికవర్గానికి చెందిన ప్రజలు, ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత, అభ్యంతరకర వ్యాఖ్యలుచేయలేదని మండిపడ్డారు. తనపైనా మోదీ కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేశారని, అయితే తన జీవితంలో ఎన్నడూ ఒక సామాజికవర్గాన్ని వేరుచేసి చూడలేదని, అది బీజేపీకి మాత్రమే ఉన్న కాపీరైట్ అని ఆయన ఎద్దేవాచేశారు. ‘గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ఊహించని సంక్షోభాన్ని చవిచూసింది.
పెద్దనోట్ల రద్దు విపత్తు, లోపభూయిష్ఠమైన జీఎస్టీ, కొవిడ్19 సమయంలో నిర్వహణ లోపాలతో దేశం దయనీయమైన పరిస్థితుల్లోకి జారిపోయింది’ అని మన్మోహన్ విరుచుకుపడ్డారు. ‘గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం పంజాబీలను అణచివేసింది.
ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమించిన రైతుల్లో పంజాబ్‌కు చెందిన 750మంది అమరులయ్యారు. మన రైతులను ఆందోళనజీవులు, పరాన్నజీవులు అంటూ పార్లమెంటులో ప్రధాని ఎద్దేవా చేశారు.
గత పదేళ్లలో ఆయన విధానాలతో రైతుల ఆదాయానికి గండిపడింది. ఒక్కో రైతుపై రుణభారం సగటున రూ.27 వేల వరకూ ఉంది. ఇంధనం, ఎరువుల రేట్లు పెంచడం, 35 వ్యవసాయ సంబంధిత పరికరాలపై జీఎస్టీ విధించడం వంటి నిర్ణయాలు రైతు కుటుంబాల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపాయి’ అని ఆయన గుర్తు చేశారు.