Share News

Tomato Price: కొండెక్కిన టమాటా ధర.. కిలో ఎంత పలుకుతోందంటే..

ABN , Publish Date - Oct 05 , 2024 | 07:14 PM

దేశవ్యాప్తంగా టమాటా ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. కిలో టమాటా ధర రూ.100 పలుకుతుండడంతో ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. పండగ సీజన్ కావడం, ఉత్పత్తి కొరత కారణంగా రేట్లు ఆకాశాన్ని అంటుతున్నట్లు నిపుణులు చెప్తున్నారు.

Tomato Price: కొండెక్కిన టమాటా ధర.. కిలో ఎంత పలుకుతోందంటే..

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా టమాటా ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. కిలో టమాటా ధర రూ.100 పలుకుతుండడంతో ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. పండగ సీజన్ కావడం, ఉత్పత్తి కొరత కారణంగా రేట్లు ఆకాశాన్ని అంటుతున్నట్లు నిపుణులు చెప్తున్నారు. నిన్న మెున్నటి వరకూ కిలో రూ.40 ఉన్న ధర ఒక్కసారిగా రూ.100కు పెరగడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ప్రజల్లో నెలకొంది. కూర ఏదైనా కానీ టమాటా వేయనిదే వంట పూర్తి కాదని పెద్దలు అంటుంటారు. అలాంటిది ఇంత ధర పెట్టి ఇప్పుడు ఎలా కొనుగోలు చేయాలంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ధర పెరుగుదల.. కారణాలు ఇవే..

టమాటా ధరలు పెరగడానికి దసరా మహోత్సవాలే ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు. అందువల్లనే కిలో రూ.100కు చేరిందని చెప్తున్నారు. మరోవైపు ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో ఉత్పత్తి తగ్గిందని అంటున్నారు. ఇంకోవైపు వేడిగాలులు కారణంగా పంట దెబ్బతిందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మిగిలిన పంట దెబ్బతిందని, సరఫరాలోనూ తీవ్ర సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్తున్నారు. అందువల్లనే సరఫరా తగ్గి డిమాండ్ పెరిగిందని అధికారులు చెప్తున్నారు.


ఢిల్లీలో ఇదీ పరిస్థితి..

దసరా ఉత్సవాల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో కిలో టమాటా ధర రూ.100కి చేరింది. రిటైల్ మార్కెట్ ధర 24గంటల్లోనే రూ.20 పెరిగిందని స్థానిక అధికారులు చెప్తున్నారు. హోల్‌సేల్ మార్కెట్‌లో కేజీ ధర రూ.10పెరిగిందని పేర్కొంటున్నారు. అయితే పండగ సమయం కావడం, సరఫరా తగ్గిపోవడంతో ధరలు పెరిగినట్లు స్థానిక వ్యాపారులు సైతం చెప్తున్నారు. గత నెలతో పోలిస్తే రూ.27 ధర అధికంగా పెరిగినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. ఢిల్లీ మోడల్ టౌన్ ప్రాంతంలోనూ రిటైల్ ధర రూ.100 పలుకతోంది. అలాగే నిన్న(శుక్రవారం) చిల్లర ధర కేజీ రూ.80ఉండగా.. 24గంటల్లోనే అది మరో రూ.20పెరిగి రూ.100కి చేరింది. రానున్న రోజుల్లో కిలో రూ.120కి చేరే అవకాశం ఉందని స్థానిక వ్యాపారులు చెప్తున్నారు. మరోవైపు అక్టోబర్ 3న ఆజాద్ పూర్ మార్కెట్‌లో కేజీ రూ.70 ఉండగా.. చిల్లర ధర రూ.80గా ఉంది. శనివారం ఉదయం మార్కెట్‌లో కేజీ రూ.80పలుకుతుండగా.. చిల్లర ధర రూ.100గా ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. పండగ సీజన్ తర్వాత ధరలు తగ్గే అవకాశం ఉందని వారు చెప్తున్నారు.


తెలుగు రాష్ట్రాల్లో ధర ఎలా ఉందంటే..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉల్లి, టమాటా ధరలు ఎగబాకుతున్నాయి. వర్షాలు, వరదలకు ఇతర రాష్ట్రాల్లో టమాటా, ఉల్లి దిగుమతులు తగ్గడంతో వీటికి డిమాండ్‌ ఏర్పడింది. టమాటా రిటైల్ ధర ఇప్పటికే సెంచరీ కొట్టగా.. ఉల్లి కూడా అదే బాటలో నడుస్తోంది. గతవారం కొత్త ఉల్లి కిలో రూ.40, పాత ఉల్లి రూ.60 ఉండగా, ఇప్పుడు పాత ఉల్లిపాయలు రూ.80పైనే పలుకుతున్నాయి. టమాటా గతవారం రూ.50లోపు ఉండగా, ఇప్పుడు రూ.100కి చేరింది. ఇక మహారాష్ట్రలో నాణ్యమైన ఉల్లి క్వింటా రూ.3,500 వరకు పలుకుతోంది. దీంతో ఏపీ మార్కెట్‌లో పాత ఉల్లిని కొందరు బయటకు తీయడం లేదు. ధర తక్కువగా ఉన్న కొత్త సరుకును రిటైల్‌ మార్కెట్‌లో అమ్మేస్తున్నారు. ఇలానే ధరలు పెరిగితే తమ పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి నిత్యావసరాల ధరలు తగ్గించాలని కోరుతున్నారు.

Updated Date - Oct 05 , 2024 | 07:26 PM