Amit Shah: త్రిపురలో ముగిసిన తిరుగుబాటు
ABN , Publish Date - Sep 05 , 2024 | 05:55 AM
దశాబ్దాల సాయుధ పోరాటానికి స్వస్తి పలుకుతూ త్రిపురలో రెండు తిరుగుబాటు గ్రూపులు జన జీవన స్రవంతిలో కలిసేందుకు అంగీకరించాయి.
శాంతి ఒప్పందంపై 2 రెబల్ గ్రూపుల సంతకాలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 4: దశాబ్దాల సాయుధ పోరాటానికి స్వస్తి పలుకుతూ త్రిపురలో రెండు తిరుగుబాటు గ్రూపులు జన జీవన స్రవంతిలో కలిసేందుకు అంగీకరించాయి. ఈమేరకు కేంద్రం, త్రిపుర ప్రభుత్వంతో నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఎన్‌ఎల్‌ఎ్‌ఫటీ), ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ (ఏటీటీఎఫ్) గ్రూపులు శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాయి.
బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో త్రిపుర శాంతి ఒప్పందంపై సీఎం మాణిక్ సాహా, కేంద్ర హోంశాఖ అధికారులు, రెండు రెబల్ గ్రూపుల ప్రతినిధులు సంతకాలు చేశారు. దీనిపై అమిత్‌షా స్పందిస్తూ.. ‘ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు.. గత 35 ఏళ్ల పోరాటానికి ముగింపు పలుకుతూ రెండు రెబల్ గ్రూపులు శాంతి మార్గంలోకి వస్తున్నందుకు సంతోషిస్తున్నాను. దాదాపు 10 వేల మంది ఆయుధాలు విడిచి జన జీవన స్రవంతిలోకి వస్తున్నారు’ అని పేర్కొన్నారు.