Delhi : వైద్యుల భద్రతపై కమిటీ!
ABN , Publish Date - Aug 18 , 2024 | 05:04 AM
డాక్టర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది భద్రతకు తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. సంబంధిత నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను కమిటీకి తెలపవచ్చునని వెల్లడించింది.
నియమిస్తామని ప్రకటించిన కేంద్రం
దేశవ్యాప్తంగా స్తంభించిన ఓపీ సేవలతో తీవ్ర ఇబ్బందులు పడ్డ రోగులు
వరుసగా రెండో రోజు సీబీఐ ఎదుటకు ఆర్జీ కర్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్
నియమిస్తామని ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ, ఆగస్టు 17: డాక్టర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది భద్రతకు తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. సంబంధిత నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను కమిటీకి తెలపవచ్చునని వెల్లడించింది. కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన ఆర్జీ కర్ వైద్యకళాశాల, ఆస్పత్రిపై 40మంది దుండగులు దాడి చేసి.. విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
హత్యాచార ఘటన, ఆస్పత్రిపై దాడికి నిరసనగా భారత వైద్య మండలి (ఐఎంఏ) పిలుపు మేరకు శనివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో ‘నాన్ ఎమర్జెన్సీ’ సర్వీసులు నిలిచిపోయాయి. ఫలితంగా ఓపీలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులుపడ్డారు. కాగా వైద్యుల భద్రతకు సంబంధించి ఐఎంఏ ఐదు డిమాండ్లు చేస్తోంది.
ఎపిడమిక్ డిసీస్ యాక్ట్ 1897ను అనుసరించి 2019లో హాస్పిటల్ ప్రొటెక్షన్ బిల్లులో 2023లో పొందుపర్చిన సవరణలను అమలు చేయాలని, అప్పుడు వైద్యుల భద్రత పటిష్టం అవుతుందని ఐఎంఏ అంటోంది.
వైద్యుల జీవన స్థితిగతులు, పనివేళలకు సంబంధించి పరిస్థితులను గణనీయంగా మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తోంది. ఆర్జీ కర్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురై న వైద్యురాలు అప్పటికీ వరుసగా 36 గంటలపాటు విధుల్లో ఉండటం, విశ్రాంతి తీసుకునేందుకు సరైన ఏర్పాట్లేవీ లేకపోవడం.. ఫలితంగానే ఆమె పట్ల ఘోరం జరిగిందని ఓ వైద్యుడు పేర్కొన్నారు.
ఏ వైద్యుడైనా 8 గంటలు లేదా 12 గంటల వరకు నిర్విరామంగా పనిచేయగలరు. కానీ.. 36 గంటలపాటు ఎలా పనిచేయగలరు? ఈ స్థాయి పని ఒత్తిళ్లు అటు వైద్యులకు గానీ.. రోగులకు గానీ మంచిది కాదు అని చెప్పారు.